మెరుపు వేగంతో దూసుకు వచ్చిన కారు... ఏపీకి చెందిన యువతి మృతి.

మెరుపు వేగంతో దూసుకు వచ్చిన కారు... ఏపీకి చెందిన యువతి మృతి.

తమిళనాడు:

రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీసులు.. ఎన్ని నిబంధనలు విధించినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, అధిక వేగం కారణంగా ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బలి అయ్యారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. చెన్నైలోని ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతుండగా ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు. కాగా, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీస్‌ ముగిసిన తర్వాత.. వారు ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్‌ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఓ యువతి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.

ఇక, మృతి చెందిన యువతులు.. తిరుపతికి చెందిన ఎస్‌.లావణ్య (24), కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఆర్‌. శ్రీలక్ష్మీ (23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ సర్వీస్‌లో ఎనలిస్ట్‌లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కి.మీల వేగంతో ఉందని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.