సచివాలయ ఉద్యోగి మాయజలం.: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటుగా రుణం

సచివాలయ ఉద్యోగి మాయజలం.: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటుగా రుణం..

సబ్‌రిజిస్ట్రార్‌ శేఖర్ ఫిర్యాదుపై కేసు నమోదు..

కృష్ణాజిల్లా: పెడన:

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి వద్ద అప్పు తీసుకున్న సచివాలయ ఉద్యోగి ఉదంతం పెడనలో వెలుగుచూసింది. దీనిపై స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ నుంచి ఫిర్యాదును అందుకున్న పోలీసులు నిందితుడిపై బుధవారం సాయంత్రం కేసు నమోదు చేశారు.

పెడన 22వ వార్డుకు చెందిన పేరం గాయత్రీ వరప్రసాద్‌(24) బందరు మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.* పెడనలోని బ్రహ్మపురం సర్వే నెంబరు 454లో *గుడివాడకు చెందిన కాసాని రాఘవులు* నుంచి గత డిసెంబరులో 215 చదరపు గజాల స్థలాన్ని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి పెడన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2021 డిసెంబరు 20వ తేదీన రిజిస్ట్రేషన్‌ జరిగింది.

ఈ దస్తావేజులను మచిలీపట్నం ఐడీఎఫ్‌సీ బ్యాంకులో తనఖా పెట్టి రూ.13 లక్షల రుణాన్ని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తీసుకున్నారు. ఇంతవరకు అంతా నిబంధనల ప్రకారం జరిగినా.. ఆ తర్వాత అసలు మోసం ప్రారంభమైంది.ఈ స్థలంపై మరింత అప్పు తీసుకునేందుకు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి సబ్‌రిజిస్ట్రార్‌ చేతికి చిక్కారు.ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిన నాలుగు రోజులకు సదరు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఇదే ఆస్తికి సంబంధించి పెడన సబ్‌రిజిస్ట్రార్‌ సంతకం ఫోర్జరీ చేసి 5 పేజీల నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు.ఈ క్రమంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సంబంధించి స్టాంపును కూడా చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ రిజిస్ట్రేషన్‌ 2021 డిసెంబరు 24న జరిగినట్లు రికార్డులు సృష్టించాడు.

ఈనకిలీ డాక్యుమెంట్లను స్థానిక 19వ వార్డు దక్షిణ తెలుగుపాలేనికి చెందిన గుడిసె పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వద్ద తనఖా పెట్టి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఏడాది కావస్తున్నా అసలు, వడ్డీ చెల్లించకపోవడం, అడిగితే నిర్లక్ష్యంగా బదులివ్వడంతో అనుమానం వచ్చిన పూర్ణచంద్రరావు బుధవారం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి డాక్యుమెంట్లు చూపించారు.

వీటిని నిశితంగా పరిశీలించిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌ఆర్‌ శేఖర్‌ తన సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించి పెడన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించిన ఎస్సై మురళీ,నిందితుడైన సచివాలయ ఉద్యోగిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.