వాలంటీర్లు అలా చేయకూడదు.. ఈసీ కీలక ఆదేశాలు
ఏపీ:
ఏపీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములను చేయవద్దని హితవు పలికారు.
గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏ అభ్యర్థి తరఫున వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదని తెలిపింది. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నందున వారిని భాగస్వాములను చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులు, ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల సంఘం సూచించింది. అటు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కూడా వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించరాదని ఆదేశించింది.

