కొడాలి నానికి ఎదురు దెబ్బ - జనసేనలోకి సన్నిహితుల జంప్ : నేడు పవన్ జనవాణి

 *కొడాలి నానికి ఎదురు దెబ్బ - జనసేనలోకి సన్నిహితుల జంప్ : నేడు పవన్ జనవాణి..!!*

గుంటూరు :


మాజీ మంత్రి కొడాలి నాని తన సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా కొనసాగిన పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు. సారధిబాబు, మోహన్ బాబు జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కొడాలి నాని శృతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పైన తరచూ చేస్తున్న వ్యక్తిగత విమర్శల పైన వారు అసహనం వ్యక్తం చేసారు. రాజకీయంగా విమర్శలకు మాత్రమే పరిమితం కావాలంటూ తాము పలుమార్లు కోరిన విషయాన్ని వెల్లడించారు.

వ్యవహార శైలి నచ్చకనే

కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తాము జనసేనలో చేరినట్లుగా వారు చెప్పుకొచ్చారు. ఇక, జనసేనాని రెండో విడత జనవాణి కార్యక్రమ నిర్వహణకు సిద్దమయ్యారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవటానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. గత వారం పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు పంపుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందనకు నిజమైన స్పందన లేదని.. అందుకే తమ వద్దకు ఇంత భారీ సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.

రెండో విడత జనవాణీ

దీంతో.. దీనికి కొనసాగించాలని జనసేనాని నిర్ణయించారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణ పైన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. వైసీపీ సమావేశాలు సర్కస్ తరహాలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా.. వైసీపీ మంత్రులు -నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ మాట్లాడుకున్నారని విమర్శించారు.

ప్లీనరీ కోసం అధికార దుర్వినియోగం భారీ స్థాయిలో జరిగిందని ఆరోపించారు. పెద్ద పెద్ద గుడారాలు‌ వేసి.. సర్కస్ నిర్వహించిన విధంగా ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడటం వింతగా ఉందని మనోహర్ ఎద్దేవా చేసారు.