ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ సిబ్బందికి హెచ్చరిక!

 ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్  సిబ్బందికి హెచ్చరిక!

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
 పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఫిర్యాదుదారుతో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ విధుల నుంచి తప్పించిన సీపీ

చార్జి మెమో జారీ... ఘటనపై విచారణకు ఆదేశం.

విశాఖపట్నం, మే 10 : విశాఖపట్నం  కంచరపాలెం 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో లో నివాసం ఉండే పిల్లి  చంద్రశేఖర్, అతని సతీమణి గత రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తమకు ప్రమాదం పొంచి ఉందని తమకు సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసిన సందర్భంగా బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరించి దుర్భాషలాడిన సంఘటనను తీవ్రంగా పరిగణించి సంబధిత హెడ్ కానిస్టేబుల్ నెంబర్ 1145 బి. గోవింద్ ను కంట్రోల్ రూమ్ విధుల నుంచి తప్పించినట్లు వైజాగ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ ను  పనిష్మెంట్ కింద   ఆర్మూడ్ రిజర్వ్ విభాగానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు చార్జి మెమో కూడా జారీ చేశామని, ఈ ఘటనపై విచారించి  సంబంధిత హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లకు ఆశ్రయించే ప్రజలు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదతో నడుచుకోవాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులపట్ల కానీ, ప్రజల పట్ల కానీ  పోలీస్ సిబ్బంది బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్  శ్రీకాంత్ హెచ్చరించారు. కాగా పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన పిల్లి చంద్రశేఖర్ సమస్యను కూడా స్థానిక పోలీసులు విచారించి  చట్ట ప్రకారం  చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు  సిబ్బందిని సీపీ ఆదేశించారు.