"అసని" తుఫాను దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన నగర మేయర్
“అసని" తుఫాను దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గొలగాని వారి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం ఆమె బంగాళాఖాతంలో ఏర్పడిన “అసని” తుఫాను వలన నగరంలో గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతమైన జ్ఞానాపురం పరిసర ప్రాంతాలలో వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, తహసీల్దార్ రామారావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ నగరంలో తీవ్రంగా గాలులు, భారీ వర్షం పడుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు, కాలువలు పొంగే ప్రమాదం ఉన్నందున, లోతట్టు ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నందున ఆ ప్రాంతపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే, టోల్ ఫ్రీ నెంబర్ 1800 - 4250 - 0009, 0891–2869106 లకు ఫోన్ చేయాలని, గాలుల తీవ్రత దృష్ట్యా హోర్డింగులు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని నగర ప్రజలకు సూచించారు. జివిఎంసి యంత్రాంగం ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజల కొరకు ముందస్తుగా షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, జ్ఞానాపురం, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఈ ప్రాంత ప్రజల కొరకు షెల్టర్ ఏర్పాటు చేశామని తెలిపారు. షెల్టర్లకు వచ్చే ప్రజల కొరకు మౌలిక వసతులు కల్పించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
అనంతరం ఎర్రగెడ్డ కాలువలోని పేరుకుపోయిన వ్యర్థాలను జెసిబి సహాయంతో తొలగించే ప్రక్రియను పరిశీలించి, గెడ్డలోని మురుగు నీరు సాఫీగా పోయే విధంగా ఎక్కడా అడ్డంకులు లేకుండా చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.

.jpg)