ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు

ప్రజల ఆకాంక్షలు అందుకునేలా ప్రజాపాలన

*"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు *

_ఎండాడ: వి న్యూస్: సెప్టెంబర్ 22:

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేసే ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను గాడిలోకి పెట్టే అనుభవమున్న నాయకత్వం కావాలని కూటమికి చరిత్ర ఎరుగని విజయాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. జీవీఎంసీ 8 వార్డు ఎండాడలో ఆదివారం జరిగిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం 16,347 పోస్టులలో మెగా డీఎస్సీ, రూ. 4 వేలకు పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు, వేల మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ప్రారంభం వంటి ప్రజోపయోగ పథకాల దస్త్రాలపై అధికారం చేపట్టిన రోజే సంతకం పెట్టామని వివరించారు. భీమిలి నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి 2 వేల మందికి ఆకలి తీరుస్తున్నామన్నారు. దీపావళి నుంచి మహిళలకు 3 ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నామని చెప్పారు. వాలంటీర్ల జోక్యం లేకుండా 60 లక్షల పెన్షన్లు ఒక్క రోజులో అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పవిత్రమైన ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా చేశారని జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. సింహాచలంలో కూడా 945 కేజీల కల్తీ నెయ్యి సీజ్ చేశామని, ఇకనుంచి నాణ్యమైన సరకులు వాడేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. అనంతరం ఎండాడ చెరువు సందర్శించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కోరాడ రాజబాబు, పంచకర్ల సందీప్, చెట్టుపల్లి గోపీ, ఎన్.అప్పారావు, ఎస్.శ్రీనివాస్, జోనల్ కమిషనర్ సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.