ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టండి:జివిఎంసి కమీషనర్ సిఎం.సాయికాంత్ వర్మ
విశాఖ :పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 05:
విశాఖపట్నం డిసెంబర్ 5:- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, జోన్-4 నందు గల జివిఎంసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆధునీకరణ పనులు ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నాల్గవ జోన్ పరిధిలోని జివిఎంసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విశాఖ నగరంలో గల ప్రపధమ స్టేడియం ఇందిరా ప్రియదర్శిని స్టేడియమని, నగరంలో గల ప్రజలకు, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు ఈ స్టేడియం ఎంతో ఉపయోగపడుతూ ఉందని, దీనిని ఆధునీకరణతో మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. స్టేడియం నందు పలుచోట్ల మరమ్మతులు ఉన్నందున వాటి పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్యాలరీ మరమ్మత్తులను, స్టెయిర్ కేస్, ఫ్లోరింగు పనులు, గ్యాలరీలను అందమైన పెయింటింగ్ లతో, కామెంట్రీ బ్లాక్ మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని, అవసరమైనచోట చైన్ లింక్ మెస్ ఏర్పాటు చేయాలని, స్టేడియం లో ప్లెడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, స్టేడియం అంతా మంచి ల్యాండ్ స్కేప్ తో, పచ్చదనం నిండి ఉండేలా అందమైన మొక్కలు నాటాలని, 05 సంవత్సరాలకు స్టేడియం కార్యకలాపాలు మరియు నిర్వహణ పనులు చేపట్టుట కొరకు అంచనాలు తయారు చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణరాజు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరావును కమిషనర్ ఆదేశిస్తూ, క్రీడాకారులకు స్ఫూర్తిని కలిగించేలా స్టేడియంను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు దీటుగా అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. స్టేడియం నందు 24 గంటలు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ శివప్రసాద్ ను కమీషనరు ఆదేశించారు.అనంతరం జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తుఫాన్ వలన వర్షాలు పడుతున్నందున, రోడ్డు పైకి వ్యర్ధాలు వస్తున్నందున, ఆ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అలాగే రోడ్లపై మొక్కలు, చెట్లు ఏవైనా పడి ఉన్నట్లయితే వెంటనే తొలగించాలని ఆదేశించారు. తుఫాను వలన వర్షాలు అధికంగా పడుతున్నందున అధికారులు కాలువలలో పూడికలు, అడ్డంకులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కార్యనిర్వాహక ఇంజనీరు సంతోషి, శేఖర్ బాబు, ఎసిపి వినయ ప్రసాద్, ఎ.ఎం.ఒ.హెచ్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

