రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డాగా జగనన్న కాలనీ

రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డాగా జగనన్న కాలనీ

* నిజమైన పేదలకు మొండి చేయి..

* జగనన్న కాలనీలపై సమగ్ర దర్యాప్తు చేయాలి...

*సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్

పాచిపెంట : వి న్యూస్  అక్టోబర్ 1...


మండల కేంద్రం స్థానిక జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డగా మారాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, మంచాల శ్రీనివాసరావు ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు, ప్రభుత్వం పేద ప్రజలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల ను కొంతమంది అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పేదలకు మంజూరు చేస్తే అధికార పార్టీ నాయకులు, తన బంధువులు, తన బినామీల పేరు మీదగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయించుకుని, వాటిని క్రయ విక్రయాలు జరుపుతున్నారన్నారు. ప్రభుత్వం సెంటు స్థలాన్ని కేటాయిస్తే, ఈ అధికార పార్టీ నాయకుడు బినామీలు మాత్రం రెండున్నర నుంచి మూడు సెంట్లు విస్తీర్ణంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు అన్నారు. వీటికి సంబంధించి మూడు రోజులుగా వార్తా కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడంలేదన్నారు. అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వలనే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజమైనటువంటి పేదలకు ఇల్లు మంజూరు కాలేదన్నారు. మొత్తం లేఅవుట్ లో 227 ఇళ్ల స్థలాలను కేటాయిస్తే, కేవలం 184 మందికి మాత్రమే హౌసింగ్ శాఖ నుంచి ఇల్లు మంజూరయ్యాయని, మిగతా పట్టాలు ఎవరు వద్ద ఉన్నాయో వాటికి ఎందుకు ఇల్లు మంజూరు కాలేదో అధికారులు తెలియజేయాలన్నారు. అలాగే కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి జియోటాకింగ్ ఓ స్థలంలో చేస్తే ఇంటి నిర్మాణం మాత్రం వేరే స్థలంలో ఉందని, వీటికి బిల్లులు చెల్లింపులు ఎలా జరిగాయో... ఒక్కసారి గమనిస్తే ఏ మేరకు అవినీతి జరిగిందో అర్థం అవుతుందన్నారు. తక్షణమే ఈ అవినీతి అక్రమాలపై అధికారులు స్పందించి, సమగ్ర దర్యాప్తు చేయాలని లేకుంటే సిపిఎం రాష్ట్రస్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పోరాటం ఉదృతం చేస్తామన్నారు.