ప్రజా సౌకర్యార్థమై థీమ్ పార్కుల అభివృద్ధి : జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ

ప్రజా సౌకర్యార్థమై థీమ్ పార్కుల అభివృద్ధి : 

జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ

విశాఖపట్నం: వి న్యూస్ :  డిసెంబర్ 26:- ప్రజా సౌకర్యార్థమై అధునాతమైన సౌకర్యాలతో ధీమ్ పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నట్లు జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం ఆయన రెండవ జోన్ 6, 8 వార్డుల పరిధిలోని పోతిన మల్లయ్య పాలెం షిప్ యార్డ్ లేఅవుట్ లోని యోగా థీమ్ పార్క్, బక్కన్న పాలెం లచ్చిరాజు లేఅవుట్ లోని స్పోర్ట్స్ థీమ్ పార్క్, ఎమ్మెస్సార్ లేఅవుట్ లోని ల్యాండ్ స్కేప్ థీమ్ పార్క్, వై.ఎల్.పి లేఅవుట్ ఫామ్ గార్డెన్ పార్కులతో పాటు కొమ్మాది జంక్షన్, "లా" కాలేజ్ బస్టాపు జంక్షన్ లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యోగా థీమ్ పార్కులో పచ్చదనంతో కూడిన అందమైన మొక్కలను ఏర్పాటు చేయాలని, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణ, ప్రధాన గేటు ఏర్పాటు చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ డైరెక్టరు ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరావును, పర్యవేక్షక ఇంజనీరు శాంసన్ రాజు ను ఆదేశించారు. స్పోర్ట్స్ థీమ్ పార్కులోని వాలీబాల్, షటిల్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ మల్టీప్లై గ్రౌండ్ పరిశీలించి గ్రీనరీ కొరకు ఆకర్షణమైన మొక్కలను నాటాలని డిడిహెచ్ ను ఆదేశించారు. వై ఎల్ పి థీమ్ పార్కులో కెనోపి చెట్లతోపాటు 75 శాతం పార్కు పచ్చదనం నిండి ఉండేలా, అలాగే వై ఎల్ పి పార్కు అభివృద్ధి కొరకు నివాసిత సంక్షేమ సంఘాన్నిఏర్పాటు చేయాలని, ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా పార్కులను అభివృద్ధిపరిచి, త్వరతగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాది జంక్షన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నేషనల్ రోడ్డు నందు లా కాలేజీ జంక్షన్ వద్ద ఉన్న బస్ స్టాప్ రోడ్డు మధ్యలో ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున “వి” కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా విశాలమైన స్థలాన్ని సూచించి అచ్చటకు మార్పు చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మిని కమిషనర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో ఏ.ఎం.ఓ.హెచ్ కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వంశీ, సహాయక ఇంజనీర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.