ప్రమాదానికి గురైన మరబోటుకి నష్టపరిహారం చెల్లించాలి..! టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి
భీమిలి : వి న్యూస్ : నవంబర్ 14:
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు బయలుదేరుతూ ఇంజన్లో సాంకేతిక కారణాలు వలన భీమిలి తీరప్రాంతంకి కొట్టుకు వచ్చిన మరబోటుకు నష్టపరిహారం చెల్లించి బోటు యజనానిని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
భీమిలి మండలం చిన నాగమయ్య పాలెంకి చెందిన ఎమ్ ఎఫ్ ఆర్ 849 గల మరబోటు సోమవారం రాత్రి వేట కోసమని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరిందని, ఇంజన్లో వచ్చిన సాంకేతిక కారణాలు వలన బోటు మధ్యలో ఆగిపోయిందని అన్నారు. బోటులో ఉన్న డ్రైవర్ వాసుపల్లి నీలయ్య చాకచక్యంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఒడ్డుకు మల్లించడంతో బోటులో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. బోటులో గరికిన దానయ్య, గరికిన నూకరాజు, గరికిన ఎల్లాజీ, వాసుపల్లి కుంచెయ్య, వాసుపల్లి దానయ్య, వాసుపల్లి అప్పారావు, బొడ్డు దుర్గయ్య ఉన్నారని అన్నారు. వీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అయితే బోటు రాళ్ళ మధ్యలో ఇరుక్కు పోవడంతో ఆస్తినష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని గంటా నూకరాజు తెలియజేసారు. ఒక బోటు కారణంగా ఏడెనిమిది కుటుంబాలు బ్రతుకుతాయని, ఇప్పుడు ఈ బోటు ప్రమాదవశాత్తు ఒడ్డుకు చేరడంతో వేటకు వెళ్లలేని పరిస్థితని అన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ బాధ్యత తీసుకొని ప్రమాధానికి గురైన బోటుకు నష్టపరిహారం ఇచ్చినట్లయితే మరలా మరమ్మతులు చేయించి వేటకు వెళ్ళుటకు సిద్ధంగా ఉంటుందని, దీనికారణంగా బోటుమీద ఆధారపడిన రైతులు క్షేమంగా ఉంటారని, వారి జీవనోపాదికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని గంటా నూకరాజు ప్రభుత్వాన్ని కోరారు.


