ఇస్కాన్ సాగర్నగర్లో మంగళవారం గోవర్ధన పూజా మహోత్సవం

ఇస్కాన్ సాగర్నగర్లో మంగళవారం గోవర్ధన పూజా మహోత్సవం.

వివరాలు తెలిపిన ఇస్కాన్ సాగర్ నగర్ అధ్యక్షులు సాంబ దాస్.

సాగర్ నగర్: వి న్యూస్ : నవంబర్ 13: 

సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈ పవిత్రమైన దినమున, శ్రీకృష్ణ భగవానుడు అప్పటి సాంప్రదాయమైన ఇంద్ర పూజకు స్వస్తి పలికి గోవర్ధన పూజను ప్రారంభించాడు. ఇది స్వర్గ రాజు ఇంద్రుడికి ఆగ్రహం తెప్పించింది. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని, తన అహంకారాన్ని అనచడానికే ఈ విధంగా చేస్తున్నారని తెలియక, ఇంద్రుడు వినాశకరమైన వర్షాన్ని కురిపించి బృందావనం గ్రామాన్ని నాశనం చెయ్యాలని అనుకున్నాడు. బృందావ జనులకు ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలితో గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడు సృష్టించిన వరదల నుండి బృందావన వాసులను అలవోకగా రక్షించాడు. శ్రీకృష్ణుని ఆదేశాన్ని అనుసరించి, నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు, స్వయం కృష్ణ భగవానుడి అవతారమైన గోవర్ధన పర్వతాన్ని ఈ శుభ దినమున పూజిస్తారు.

ఉత్సవంలో భాగంగా గోవర్ధన పర్వతాన్ని తలపించే విధంగా అన్నం, వివిధ రకాల స్వీట్లు, పలుకులు మరియు పండ్లతో అన్నకూట్ (ఆహార పర్వతం) ఏర్పాటు చేసి భక్తులందరూ ఉత్సాహంగా భక్తి తప్త హృదయాలతో దానిని ఆరాధించడం జరుగుతుంది.

భక్తులందరి కోలాహలపూరితమైన కీర్తనల మధ్య గిరిరాజు కు పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించి హారతి నివ్వడం జరుగుతుంది. అభిషేకం, ఆరతి అనంతరం భక్తులంతా గిరిరాజు చుట్టూ పరిక్రమ చేస్తారు.

అనంతరం భక్తులు ప్రేమగా తయారు చేసిన 1008 రకాల భోగాలను గిరిరాజుకి సమర్పించి దానిని ప్రసాదంగా భక్తులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది.

ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ పసందైన విందు బోజన ప్రసాద వితరణ జరుగుతుంది. అని తెలిపిన ఇస్కాన్ సాగర్ నగర్ అధ్యక్షులు సాంబ దాస్.