జగనన్నకు చెబుదాం అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి

 జగనన్నకు చెబుదాం అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

విశాఖ రూరల్ మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం  నిర్వహణ.

మండల స్థాయి జగనన్నకు చెబుదాం కు 60 అర్జీలు.జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున.

విశాఖపట్నం,వి న్యూస్  సెప్టెంబర్ 22 : 

జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం విశాఖ రూరల్ మండలం, యన్టీఆర్ కాలనీ సచివాలయం అవంతి ఫంక్షన్ హాల్ నందు  మండల స్థాయి ''జగనన్నకు చెబుదాం '' ( స్పందన ) కార్యక్రమం నిర్వహించారు. విశాఖ రూరల్ మండల పరిధిలో ఉన్న గ్రామ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా ప్రధాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం  జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 8వ తేది నుండి అక్టోబర్ 13 వ తేది వరకు బుధవారం, శుక్రవారం వారంలో రెండు రోజులలో మండల కేంద్రాలలో  నిర్వహిస్తున్నామని చెప్పారు. 

జిల్లాలో గల ప్రతి మండలాన్ని కవర్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత తేదీలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు విశాఖ రూరల్ మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం (స్పందన ) నిర్వహించామని తెలిపారు.  జగనన్నకు చెబుదాం  కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై పూర్తి శ్రద్ధతో ఉండాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పూర్తిగా పరిశీలించి సరైన సమాధానం ఇవ్వాలని అన్నారు. నిర్దేశించిన సమయంలో గా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు ఇచ్చిన అర్జీలను జెకేసి పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి అధికారి తమ శాఖ కు చెందిన అన్ని అర్జీలు పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని తెలిపారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది జేకేసి  పై పూర్తి శ్రద్ధ వహించి పనిచేయాలన్నారు. వచ్చిన అర్జీలలో 90 శాతం సచివాలయాల పరిధిలోనే ఉంటున్నాయని పేర్కొన్నారు. 

అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లో లేకుండా చూడాలని అన్నారు.  విభాగాధిపతులందరూ ఈ కార్యక్రమం పై పూర్తి శ్రద్ధ వహించి పనిచేయాలన్నారు. వచ్చిన అర్జీలలో ప్రధానంగా రెవెన్యూ, జివిఎంసి , హౌసింగ్ , ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయని  కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను  సకాలంలో విచారణ జరిపి సత్వర  చర్యలు  తీసుకుంటామని అన్నారు. 


శుక్రవారం విశాఖ రూరల్ నిర్వహించిన  మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 60 విజ్ఞప్తులు అందాయి.


ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, జివియంసి అడిషనల్ కమిషనర్ వర్మ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల  జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.