గుడివాడలో గెలిచి బూతు పంచాంగం వినపడకుండా చేస్తాం
- చంద్రబాబు, లోకేష్ పోటీ చేయాల్సిన సీనైతే లేదు.
- నాలాంటి వాళ్లకు సీటిచ్చినా విజయం సాధిస్తాం .
- టిడిపి అభ్యున్నతి కోసమే సేవా కార్యక్రమాలు
- అందరితో కలిసి పనిచేయడం అలవాటు చేసుకున్నా
- సోదికి జనం స్పందించడం మాని చాలా కాలమైంది
- త్వరలోనే గుడివాడ ప్రజలు గట్టిగా బదులిస్తారు
- సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము
మంగళగిరి/ గుడివాడ, మార్చి 24: 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు బూతు పంచాంగం వినపడకుండా చేయడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జోన్- 3 సమీక్ష సమావేశానికి వెనిగండ్ల రాము హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ విజయం తెలుగుదేశం పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇది పూర్తిగా చంద్రబాబుకే అంకితమన్నారు. చంద్రబాబు రాజకీయ చతురత, విజన్, స్పష్టమైన ప్రణాళిక వంటివన్నీ పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలతో ప్రజల్లో, శాసనసభ్యుల్లో ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందనుకోవచ్చన్నారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలకు శాసనసభ్యులు ప్రతినిధులని, వారికి సరైన గౌరవం ఇవ్వాలన్నారు. గౌరవం లేని చోట అసంతృప్తులు రావడం సహజమన్నారు. చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సముచిత గౌరవం, విలువ ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ఓడిపోయినప్పుడు ప్రజల్లో పరువు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే వైసిపి నేతలు తెలుగుదేశం పార్టీపై బురద వేస్తున్నారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. గుడివాడలో పుట్టి పెరిగానని, నా జీవితమే గుడివాడ అని, సహజంగానే గుడివాడంటే తనకు ఇష్టమన్నారు. గుడివాడ నియోజకవర్గంలో గత నాలుగు నెలలుగా పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువకులకు మంచి కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పించానన్నారు.
చదువుకున్న వారికి ఉద్యోగం ఎంత అవసరమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ప్రతిరోజు సుమారు 15 మంది అభ్యర్థులు ఉద్యోగుల కోసం తన దగ్గరకు వస్తున్నారని, వారి అర్హతల మేరకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తున్నానన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గుడివాడ ప్రజలు కూడా త్వరలోనే గట్టిగా బదిలిస్తారని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో అందరితో కలిసి పనిచేయడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, గుడివాడ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు. చేయగలిగినన్ని పనులు చేస్తున్నానని తెలిపారు. అందరినీ కలుపుకోవడం, కలిసి పని చేయడమే తనకున్న ప్రధాన బలంగా చెప్పుకొచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో విజయం సాధించాలంటే చంద్రబాబు, లోకేష్ వంటి నాయకులు పోటీ చేయాల్సినంత సీన్ అయితే లేదన్నారు. నాలాంటి వాళ్లకు సీటు ఇచ్చినా విజయం సాధిస్తామన్నారు. పిచ్చి మాటలకు మాస్ ఓటర్లు ఆకర్షితులయ్యే పరిస్థితి లేదన్నారు. వీరంతా రేపటి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారన్నారు. పరిధి దాటి మాట్లాడే నాయకులను చాలాకాలం నుండి గుడివాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తాను కూడా అనవసర విషయాల జోలికి పోదల్చుకోలేదన్నారు. సేవ చేయడాన్ని మాత్రమే ప్రజలు ఇష్టపడుతున్నారన్నారు. సోదికి జనాలు స్పందించడం మాని చాలా కాలమైందన్నారు. పనిచేయడంలో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గుడివాడలో కొద్దిపాటి వర్షానికే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మోకాలి లోతు నీరు చేరిందన్నారు. గత 20 ఏళ్లుగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా మగ్గిపోతుందన్నారు. ఇప్పుడున్న రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ హయంలో వేసినవేనని వెనిగండ్ల రాము గుర్తు చేశారు.



.jpeg)