ఖైదీలకు ఉచిత దంత పరీక్షలు

ఖైదీలకు ఉచిత దంత పరీక్షలు

విశాఖపట్నం :

సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ విశాఖపట్నం చాప్టర్‌, గీతం డెంటల్‌ కాలేజీ, హాస్పటల్‌ సంయుక్తంగా విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో ‘‘నేషనల్‌ కాన్స్‌-ఎండో డే’’ సందర్భంగా ఆదివారం దంత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడాంటిక్స్‌ ఏటా మార్చి 5ని కాన్స్‌ - ఎండో డేగా జరుపుకుంటుంది.  ప్రజల్లో నోటి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నోటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఖైదీలకు చికిత్స అందించడం, బడుగు బలహీనవర్గాలకు సంరక్షణ అందించడమే ఈ ఆరోగ్య శిబిరం లక్ష్యం. గీతం డెంటల్‌ కాలేజీ  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డిఎస్‌ రాజు, కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడాంటిక్స్‌ డిపార్టుమెంట్‌ హెడ్‌ డాక్టర్‌ శిరీష,    హెల్త్‌ చైర్‌ డా.  శ్రావణి సంధ్య, చాప్టర్‌ చైర్‌ జగపతి రాయ్‌ కొడాలి, చాప్టర్‌ కో-ఛైర్‌ హర్ష నందన్‌, యంగ్‌ ఇండియన్స్‌ హెల్త్‌ చైర్‌ డా.శ్రావణి, వైజాగ్‌ యంగ్‌ ఇండియన్స్‌ సభ్యులు, జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌, నరేష్‌  ఓరుగంటి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఇరవై మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డెంటల్‌ విద్యార్థులు, సీనియర్‌ వైద్యులు పాల్గొని రెండు వందల మందికి పైగా ఖైదీలను పరీక్షించారు. ఈ సందర్భంగా డా.  శ్రావణి సంధ్య మాట్లాడుతూ సమాజ ఆరోగ్యం సమిష్టి బాధ్యత అని, ఇందులో మనందరి పాత్ర ఉండాలని సూచించారు.