జర్నలిస్ట్ పరశురాం పై హత్యాయత్నం.

జర్నలిస్ట్ పరశురాం పై హత్యాయత్నం

విశాఖపట్నం:

- పీడిఎస్ రైస్ మాఫియా లీడర్ పచ్చికోళ్ల కృష్ణ బరితెగింపు

- కక్ష గట్టి కిరాయి రౌడీలతో పాశవిక దాడి

- నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ దినపత్రిక ఎడిటర్ పరశురాం కు తీవ్రగాయాలు

- అక్రమాలకు వ్యతిరేకంగా వార్తలు రాశాడని అంతం చేసేందుకు పన్నాగం

- స్నేహితులతో కబురు పెట్టి హతమార్చేందుకు స్కెచ్

విశాఖపట్నం: ప్రశాంత విశాఖ నగరం అక్రమాలకు ఆలవాలంగా మారిందనటానికి నిదర్శనంగా విశాఖ గాజువాకలో జర్నలిస్ట్ పై జరిగిన హత్యాయత్నం ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అన్యాయం,అక్రమాలకు తన అక్షరాలతో ఉరివేస్తున్న కలం పై కక్ష కట్టి కత్తిదూయటంతో యావత్ జర్నలిస్ట్ లోకం మరోసారి ఉలిక్కిపడింది. వివరాలలోనికి వెళితే ప్రముఖ దినపత్రిక నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ గా ఉన్న కొయిలాడ పరశురాం అనే వ్యక్తిపై స్థానికంగా రేషన్ మాఫియా లీడర్ గా వ్యవరిస్తున్న కృష్ణ అతని అనుచరులు హత్యాయత్నం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని గత కొన్నేళ్లుగా పక్కదారి పట్టిస్తున్న రేషన్ బియ్యం మాఫియాపై ఎడిటర్ పరశురాం వార్తల రూపంలో వాస్తవాలను బహిర్గతం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలోనూ పరశురాం ను అంతమొందించే యత్నంలో పచ్చిగోళ్ల కృష్ణపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు కేసులపై రాజీ కుదుర్చుకోవాలంటూ ఎడిటర్ పరశురాంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే నేపథ్యంలో పచ్చిగోళ్ల కృష్ణ అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా మాట్లాడుకుందాం అంటూ పరశురాంను గాజువాకలోని ఓ హోటల్ కు రప్పించి అతన్ని అంతమొందించేందుకు స్కెచ్ వేశారు. ఒక్కసారిగా హోటల్ రూమ్ తలుపులు మూసివేసి మూకుమ్మడిగా దాడికి పాల్పడటంతో పరశురాం కు తీవ్రగాయాలయ్యాయి. ఒక్కసారిగా రేగిన అలజడితో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పరాశురాంను రక్షించారు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న పరశురాంను స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.