రాజ్యసభకు ఇళయరాజా విజయేంద్రప్రసాద్,పీటీ ఉషా,వీరేంద్ర హెగ్డేలకు..మోదీ కంగ్రాట్స్.
ఢిల్లీ :
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్ చేసింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దిగ్గజం ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా వారు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ నలుగురు ప్రముఖులకూ అభినందనలు తెలిపారు.
ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినప్పటికీ గత కొన్నేళ్లుగా వర్ధమాన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఆమె చేసిన కృషి కూడా ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫొటోను షేర్ చేశారు. అలాగే, సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతం ఎన్నో భావాలకు ప్రతిబింబమని.. అనేక తరాలకు ఆయన సంగీతం వారధిలా నిలిచిందని మోదీ కొనియాడారు. ఆయన జీవిత ప్రయాణం కూడా ఎంతో స్ఫూర్తిదాయకని.. అలాంటి వ్యక్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాల పాటు సృజనాత్మక సేవలు అందించారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు. వీరేంద్ర హెగ్డే గొప్ప సమాజ సేవకుడని మోదీ కొనియాడారు. ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం తనకు దక్కిందని.. ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగంలో ఆయన చేసిన గొప్ప కృషిని చూశానని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా పార్లమెంట్ కార్యకలాపాలను సుసంపన్నం అవుతాయని పేర్కొన్నారు.

