వారంలో ఒక్క రోజు ప్రజారవాణాను ఉపయోగించండి.--- నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి.
విశాఖ లోకల్ న్యూస్:
విశాఖపట్నం, - కాలుష్య నియంత్రణలో భాగంగా వారంలో ఒక్క రోజు ప్రజారవాణాను ఉపయోగించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె కాలుష్య నియంత్రణలో భాగంగా తమ క్యాంపు కార్యాలయం నుండి నడుచుకుంటూ బస్ స్టాప్ కు వచ్చి ఎపిఎస్ఆర్టిసి బస్సులో జివిఎంసి ప్రధాన కార్యలయంనకు చేరుకొని స్పందన తదితర కార్యక్రమాలు నిర్వహించి మరల బస్సులో తిరిగి ప్రయాణమై వెళ్ళారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో భార్య, భర్త ఉద్యోగాలు చేస్తున్న వారికి రెండు, మూడు వాహనాలు కలిగియుంటారని, అటువంటి వారు వారంలో ఒక్క రోజు తమ వాహానాలను విడిచిపెట్టి ప్రజా రవాణా ద్వారా వారి వారి కార్యాలయాలకు చేరుకొని, విధులు నిర్వహించి నగర కాలుష్య నియంత్రణకు వారి వంతు కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే జివిఎంసి కమిషనర్ ఆదేశాలతో జివిఎంసి ఉద్యోగులు అందరూ వారి వారి వాహనాలను వదిలి కార్యలయంనకు చేరుకున్నారని తెలిపారు. ఇప్పటి నుండి కాలుష్యం పై దృష్టిపెట్టి దాని నియంత్రణకు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
