బదిలీపై వెళ్తున్న జివిఎంసి అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన మేయర్, కమిషనర్
విధుల పట్ల అంకితభావంతో పనిచేసి బదిలీపై వెళుతున్న జివిఎంసి అధికారులను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఘనంగా సన్మానించారు. శనివారం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మిశ తో కలిసి హోటల్ మేఘాలయ లో ఏర్పాటుచేసిన సన్మాన సభలో పాల్గొని బదిలీపై వెళ్తున్న జీవీఎంసీ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విధుల పట్ల అంకితభావంతో పనిచేసి విశాఖ నగర అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. విధులలో ఎంతో నిబద్ధతతో పని చేసి ఇటు పాలకుల అటు ఉన్నతాధికారుల మన్ననలు పొందారని, అధికారులకు బదిలీలు అనేవి సహజమని ప్రభుత్వానికి మీ సేవలో ఎక్కడ అవసరము అక్కడికి బదిలీ చేస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించి నట్లే, మీరు బదిలీపై వెళ్లే ప్రాంత అభివృద్ధికి ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకున్నట్లు తెలిపారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మిశ మాట్లాడుతూ అధికారులకు బదిలీలు తప్పవని ఎక్కడ పని చేసినా అక్కడ మీ మార్కు కనిపించాలని, అంకితభావంతో పనిచేసి మీ పై అధికారుల వద్ద మన్ననలు పొందాలని తెలిపారు. ఇంతకాలం నగరంలో ప్రజలకు మీరు చేసిన సేవలు అమోఘమని, ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. మనం ఏ ప్రాంతం లో విధులు నిర్వహిస్తున్న మో అదే మన జన్మస్థలంగా భావించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కొనియాడారు.
డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, వైయస్సార్సీపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస రావు, టిడిపి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవీఎంసీ కి విలువైన సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ఉద్యోగులందరినీ అభినందిస్తున్నానని, ఇదే స్ఫూర్తితో మీరు బదిలీ అయిన ప్రాంతాలలో అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉండాలని తెలిపారు.
అనంతరం బదిలీపై వెళ్తున్న అధికారులు మాట్లాడుతూ ఉద్యోగం పట్ల వారి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు వర్మ, వై. శ్రీనివాసరావు, ప్రధాని ఇంజనీర్ రవి కృష్ణ రాజు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు, బదిలీపై వెళ్తున్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.




