“స్వచ్ఛ విశాఖ” అంబాసిడర్ గా ఆర్. పి. పట్నాయక్: జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ గా ప్రముఖులు, సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, చిత్ర దర్శకులు అయిన శ్రీ ఆర్.పి. పట్నాయక్ ను నామినేట్ చేయడమైనదని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. శనివారం నగరానికి వచ్చిన ఆర్. పి. పట్నాయక్ జివిఎంసి నందు కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరంలో 2022, జూన్-5వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించడమైనదని, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను, వస్త్ర సంచులను వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రామాలు నిరంతరం జివిఎంసి యంత్రాంగం చేపడుతూనే వుందని ఆర్.పి. పట్నాయక్ కు తెలిపారు. ఇప్పటికే నగర ప్రజలలో చాలావరకు మార్పువచ్చిందని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు మానివేసి వస్త్ర సంచులను ఉపయోగిస్తున్నారన్నారు. జూలై, 1వ తేదీ నుండి దేశమంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించడమైనదన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగానికి అలవాటు పడుతున్నా రన్నారు. ప్రజలందరికీ వస్త్ర సంచుల సరఫరా చేసే కార్యక్రమం జివిఎంసి చేపట్టిందన్నారు. ఈ విషయమై మీ సందేశాల ద్వారా, సందేశాత్మక గీతాల ద్వారా అవగాహన కొరకు విశాఖ నగర ప్రజలను ప్రభావితం చేయాలని కమిషనర్ వారిని కోరారు. జివిఎంసి స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ గా మీ సేవలు, సందేశాలు అందించాలని కోరుతూ “స్వచ్చ విశాఖ అంబాసిడర్” గా నామినేట్ చేసిన పత్రాన్ని ఆర్. పి. పట్నాయక్ కు కమిషనర్ అందించారు. అనంతరం దుశ్శాలువాతో, జ్ఞాపికతో ఆర్. పి. పట్నాయక్ ను కమిషనర్ సత్కరించారు.
