విశాఖ లోకల్ న్యూస్:
మజ్జిగౌరమ్మ ఆలయం రాయఘడ ప్రత్యేక కథ
ఒరిస్సాపదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడ్ లో ఓ కోట నిర్మించుకున్నారు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల 'మజ్జిగరియాణి'(మధ్య గదిలో వెలసిన తల్లి)గా పేరొచ్చింది. తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండడంవల్ల మజ్జిగరియాణి కాస్తా మజ్జిగౌరమ్మగా మారిపోయింది.కళింగ చారిత్రక కథనం ప్రకారం 1538 లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని హతమారుస్తాడు. ఆయన మృతితో 108 మంది రాణులూ అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఆ ప్రదేశం ప్రస్తుత మందిరం పక్కనే ఉంది. దీన్నే 'సతికుండం' అంటారు. రాజు మరణం తరువాత అమ్మవారి ఆలనా పాలనా చూసేవారే కరవయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో వైభవం మరుగునపడిపోయింది. 1930లో బ్రిటిష్‌వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకూ రైల్వేలైను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే, రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంఝావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సగంలో ఉండగానే... మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కలలో కనిపించి, 'నాకు ఆలయం నిర్మిస్తేనే... వంతెన నిలబడుతుంది' అని సెలవిచ్చింది. ఆ ప్రకారం, జంఝావతి సమీపంలో ఆలయం నిర్మించారు.ఏటా చైత్రమాసంఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ అయిదు రోజుల పాటూ చైత్రోత్సవం (చైత్ర పండుగ) జరుగుతుంది. శక్తిహోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలుత జరిగేది 'అగ్నిమల్లెలు' కార్యక్రమం. కణకణలాడే నిప్పుల పైనుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళతాడు. అనంతరం పిల్లల నుంచి వృద్ధులదాకా...వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడవడం ఆనవాయితీ. ఆ తరువాత 'ముళ్ల ఊయల' సంబరం! ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు పూజారి. ఆ అయిదు రోజులూ సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు, అదో పెద్ద జాతర ఉంటుంది.ఆలయ సింహ ద్వారం దాటగానే నిగనిగలాడే ఇత్తడి లోహపు గుర్రం ఉంటుంది. అయిదు క్వింటాళ్ల ఇత్తడి లోహంతొ చేసిన ఈ గుర్రం రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాశ్వంపై సంచరించి, పట్టణ ప్రజలను కాపాడతారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్నీ, గాజుల్నీ ముడుపులు కడతారు. దీన్ని 'ముడుపుల చెట్టు' అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని విశ్వాసం.'అమ్మా.. నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను' అని మొక్కుకుంటే చాలు, తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవశ్యంగా చెబుతారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది. రాయగఢ జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఇదీ ఆ ప్రభావమే కావచ్చు. ఆలయం బయట ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులు రాళ్ళపూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక, విధిగా రాయజానీ మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తరువాత, ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు.

