గురువులకు ఘనసత్కారం:కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం: విశాఖ లోకల్ న్యూస్
గురుపౌర్ణమి సందర్భంగా మండలములోని వేములవలస ప్రాథమిక పాఠశాలలో టీచర్లకు ఘన సత్కారం లభించింది. స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ హాజరై టీచర్లకు మెమెంటోలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. నేటి బాలలే భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేటట్టు గుణాత్మక విద్యను అందించడానికి టీచర్లు తమవంతు కృషి చేయాలన్నారు. స్థానిక హెచ్ ఎమ్ స్వర్ణలత క్రమబద్ధంగా విధులను నిర్వహిస్తూ బాధ్యతగా ఉంటున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఆమెను మిగతా టీచర్లు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహ భావం పెంచాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థ లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పిల్లలను తయారుచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నవీన్ జ్ఞానేశ్వర్ విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ ని తన సొంత వ్యయంతో సమకూర్చి అందజేశారు.నవీన్ జ్ఞానేశ్వర్ కు విద్యా పై ఉన్న మక్కువ పై టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అతన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం స్వర్ణలత, సుభాషిని, అంగన్వాడి టీచర్ నదియా, పూల మార్కెట్ ఆశీల్ కాంట్రాక్టర్ కోరాడ రమణ, దొంతల కిరణ్ కుమార్,ఒడ్ల భార్గవ్, నడిమింటి అప్పలరాజు, బోధ అప్పలరాజు, బోధ నారాయణప్పడు తదితరులు పాల్గొన్నారు.

