భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
నాడు స్మశానాలు... నేడు ఆర్ధిక వ్యవస్థను మార్చే యంత్రాలా..
రాజధాని భూముల అమ్మకంపై స్పందించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
వైసిపీ అధికారంలోకి వచ్చి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి ఒక బూటకమని, అంతా గ్రాపిక్స్ అని, ఒక్క ఇటుక కూడా కట్టలేదని, స్మశానాన్ని తలపించే విధంగా రాజధాని భూములు ఉన్నాయని ఊదరగొట్టిన వారు నేడు రాజధాని భూములను ఎలా అమ్మకానికి పెడతారని, అక్కడ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అద్దెలకు ఇస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత చాకచక్యం ఉన్నవారు ఈ దేశంలోనే ఉండరని అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. అదునాతన హంగులతో అత్యద్భుతమైన రాజధాని నిర్మించాలని మాస్టర్ ప్లాన్ చేసి రూపకల్పన చేస్తే, దురదృష్టవశాత్తు నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 5 కోట్ల ఆంధ్రుల ఆశలను తుంగలో తొక్కారని గంటా నూకరాజు చెప్పారు. అదీ కాకుండా అమరావతి ఒక గ్రాపిక్స్ అని, ఒక్క ఇటుక అక్కడ కట్టలేదని, ఆ ప్రాంతం స్మశానాన్ని తలపిస్తుందని ప్రజలకు మాయమాటలు చెప్పారని అన్నారు. అలాంటప్పుడు అక్కడ భవనాలు ప్రైవేటు వ్యక్తులకు అద్దెలకు ఇవ్వాలని ఎలా నిర్ణయిస్తారని అడిగారు. వైసిపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అమరావతిలో ఏమైనా భవనాలు కట్టారా..? అని గంటా నూకరాజు నిలదీశారు. ఒక్క ఇటుక కూడా కట్టని ఈ ప్రభుత్వానికి అక్కడ భూములను అమ్మే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నాడు పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతి భూములను పరిశీలించడానికి వెళితే తలెత్తి చూసిన ఆకాశ హార్మోనులు కనబడలేదా..? అని అన్నారు. సుదీర్ఘ కాలంపాటు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కాదని రోజుకో ఎత్తుగడ వేస్తూ జగన్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. హైకోర్టు కూడా అమరావతిపై స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కానీ ప్రభుత్వం మొండిగా ప్రవర్తించి రాజధాని భూములను అమ్మే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని ఈ ప్రభుత్వానికి ప్రజల భాదలు ఏవిధంగా అర్ధమవుతాయని అన్నారు. అప్పులు చేసి పాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను అమ్మడం తప్ప మరేమి తెలియదని దుయ్యభట్టారు. ఇప్పటికైనా రాజధాని అమరావతిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, రాజధాని భూములు అమ్మాలన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గంటా నూకరాజు ప్రభుత్వానికి సూచించారు.

