జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి .

 జగ్జీవన్ రామ్ విగ్రహానికి  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి.

విశాఖ లోకల్ న్యూస్:

సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత్ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లో ఆయన విగ్రహానికి నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి జడ్పిటిసి చైర్పర్సన్ సుభద్ర , విశాఖ కలెక్టర్ మల్లికార్జునరావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశ కలిసి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ దళిత హక్కుల పరిరక్షకులు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంచేస్తూనే సామాజిక సమానత్వంకోసం కృషిచేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. దళితుల హక్కుల అమలులో కీలక పాత్ర పోషించడంతో పాటు వారు విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని పరితపించారని కొనియాడారు. తాను అదిరోహించిన ప్రతి పదవితో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మార్గదర్శి జగ్జీవన్ రావ్ అని, ఆయన ఆదర్శాలతో మనమంతా ముందుకు సాగుదామని తెలిపారు.

 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం పోరాటం చేసిన యోధుడు అని, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరుడని, నిమ్న జాతుల ఎదుగుదలకు అహోరాత్రులు పనిచేసిన బాబు జగ్జీవన్ రావ్ మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు.

 జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ నాటి ప్రజలలో ఉన్న అసమానతలను తొలగించడానికి  బాబు జగ్జీవన్ రావ్  ఎనలేని కృషి చేశారని, భారత ఉప ప్రధాని తో పాటు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందారని, తన పోరాటంలో ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల కోసమేనని ఆమె తెలిపారు.

 జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ 115 వ జయంతి  ఆయన్ను స్మరించుకోవడం ఎంతో సంతోషమని, ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ  నిమ్న జాతుల ఆశాజ్యోతయ నిత్యం మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, ఆయన దేశం కోసం అనేక పోరాటాలు చేశారని ఆనాటి పరిస్థితులలో బడుగు బలహీన వర్గాల కోసం అంటరానితనం నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ విశ్వనాథo, జీవీఎంసీ డి సి ఆర్ నల్లనయ్య, జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్లు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.