ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఆస్తుల అన్యాక్రాంతం కై కుట్ర
నూజివీడు(వి న్యూస్ ప్రతినిధి): డిసెంబర్ 26:
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 తో ప్రజల ఆస్తుల అన్యాక్రాంతం కై కొందరు స్వార్ధపరులు, ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని నూజివీడు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఆరోపించింది. నూజివీడు పట్టణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి సత్య ప్రకాష్, సెక్రటరీ మడుపల్లి మధు రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ గోళ్ళ ప్రసాద్ లు మంగళవారం మాట్లాడుతూ ప్రజలకు పూర్తిగా నష్టాన్ని అందించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022 ను ప్రభుత్వం రద్దు చేసే వరకు ప్రజల తరపున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొత్తగా ఏవైనా చట్టాలు తీసుకువస్తే ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి కానీ, భయాందోళనలు కలిగించే రీతిలో ఉండకూడదు అన్నారు. కొత్తగా ఏర్పడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2022 తో సొంత భూములపై ప్రజల హక్కులకు ప్రశ్నార్ధకంగా మారనున్నాయని వాపోయారు. న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రజల ఆస్తి హక్కులను నిర్ణయించే అధికారం ఓ అధికారికి ఇచ్చే ప్రయత్నం దారుణం అన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సహకారంతో కొత్త చట్టం ద్వారా ప్రజల భూములను, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేసే కుట్రకు తెర లేపే విధంగా ఈ కొత్త చట్టం ఉన్నదని అన్నారు. ఈ చట్టాన్ని కొందరు స్వార్థంతో అమలులోకి తీసుకురావడం జరిగిందని, న్యాయస్థానాల సూచనలు లేకుండా రాజ్యాంగపరంగా చట్టపరమైన ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. వారసత్వపు హక్కు చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం, లిమిటేషన్ చట్టం, భూ కేటాయింపు చట్టం వంటి ఇతర అనేక చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా కొత్త చట్టం రూపకల్పన చేసి రాచరిక పాలనకు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఈ చట్టం అమలును నిరసిస్తూ గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు అనేక రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చట్టంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వార్థపరులు భవిష్యత్తులో జరిగే నష్టాలను ప్రజలకు వివరించకుండా, ఎంతో మేలు జరుగుతుందని అభూత కల్పనలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ చట్టంపై అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరికి ఎంతవరకు న్యాయం జరుగుతుందో, ప్రభుత్వ కార్యాలయాల అధికారులు అధికార పార్టీ ఆదేశాలను పాటిస్తున్నారో లేదో జగమెరిగిన సత్యం అన్నారు. అధికారుల నుండి న్యాయం జరగనప్పుడు కోర్టులను ఆశ్రయించి చట్టపరంగా న్యాయం పొందే విషయం అందరికీ తెలుసు అన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022 చట్టంతో అవగాహన ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఈ చట్టం రద్దు కోరుతూ సామాజిక బాధ్యతతో తాము ప్రజల తరపున ఆందోళనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఈనెల 27వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు రిలే దీక్షలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటిరోజు దీక్షా శిబిరంలో న్యాయవాదులు ఇందుపల్లి సత్య ప్రకాష్, కాకాని విక్రమ్ కుమార్, రామిశెట్టి సత్యనారాయణ, గోళ్ళ ప్రసాదరావు, బోగోలు చంద్రశేఖర రావు, అక్కినేని రమా కుమారి లు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరై ఉద్యమానికి సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం ప్రజల భూమి హక్కులను కాపాడేందుకు తమతో సహకరించాలని బార్ అసోసియేషన్ తరపున సబినియంగా కోరుతున్నట్లు తెలిపారు.