27,28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలి

27,28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలి..


పెన్ షాట్ కృష్ణా జిల్లా ప్రతినిధి:

కేంద్ర బి.జె.పి. ప్రభుత్వ కర్షక, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 27, 28న విజయవాడలో మహాధర్నాను జయప్రదం చేయాలని ఏపీ కార్మిక, రైతు సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. శుక్రవారం గన్నవరం లోని సిపిఐ కార్యాలయంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు మహా ధర్నా బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ గోపాలకృష్ణ మాట్లాడుతూ... స్వాతంత్య్ర ఫలితాలు దేశ ప్రజలందరికీ అందేందుకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుందని మండిపడ్డారు. దేశంలోని భౌతిక వనరులు, సంపద దేశప్రజలందరికీ చెందాలని కొద్దిమంది వద్దే సంపద కేంద్రీకరించబడరాదని పేర్కొన్నారు.  రాష్ట్రాల హక్కులను గౌరవిస్తూ కుల, మత, వర్గ, విద్వేషాలు లేకుండా లౌకిక వ్యవస్థను పదిలపరచుకుంటూ రైతులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, మైనార్టీలు, దళితులు, షెడ్యూలు తెగలవారితో సహా యావన్మంది భారత ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అభివృద్ధికి, సంక్షేమం కొరకు రైతులు, కార్మికులు, కష్టజీవులు, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతీయువకులు ఈ క్రింద పేర్కొనబడిన డిమాండ్ల సాధనకొరకు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు.

రైతు సంఘం జిల్లా నాయకులు సూరగాని సాంబశివరావు మాట్లాడుతూ...

రానున్న కాలంలో అప్రజాస్వామిక, అవినీతికర, ఫాసిస్టు బి.జె.పి.ని ఓడించే లక్ష్యసాధనతో రైతులు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమంలో  మొదటిమెట్టు నవంబరు 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయడానికి రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ...ఆహార, వాణిజ్య, ఉద్యాన, సామాజిక, వన పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50శాతం కలిపి ఎం. ఎస్ పి లను నిర్ణయించి చట్టబద్దత కల్పించాలని అన్నారు. రైతులు, పేదలపాలిట ఉరితాడు కాగల ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించాల

న్నారు. ఇప్పటికే ఉన్న 24 కోట్ల మీటర్లను తొలగించరాదన్నారు. వ్యవసాయ మోటర్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల లను బిగించరాదని డిమాండ్ చేశారు.

కౌలు రైతులతో సహా రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట ఋణాలు అందించబడాలన్నారు.

 సిఐటియు జిల్లా కార్యదర్శి

కే. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

రైతుల పంట రుణాల బకాయిలను ఒక పర్యాయం రద్దుచేయాలని,కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు "రైతు ఋణ ఉపశమన చట్టం"ను పార్లమెంటులో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలన్నారు.

కార్పోరేట్ అనుకూల ప్రధానమంత్రి పంటల భీమా పథకాన్ని ఉపసంహరించాలని సమగ్ర ప్రభుత్వ రంగ పంటల భీమా సంస్థను ఏర్పాటు చేయాలన్నారు.

తెలుగు రైతు సంఘం నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

 వాతావరణ మార్పు, కరువు, చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు గానూ భీమా పథకం అమలు చేయాలన్నారు.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పునరుద్దరించాలని పని ప్రదేశంలో సమానత్వాన్ని, భద్రతను పెంచాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులను రిజిస్ట్రేషన్ చేసి వారికి పెన్షన్తో సహా సామాజిక భద్రత అందించాలని భవన నిర్మాణ కార్మికులను ESIలో చేర్చాలన్నారు.

ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలని ఉపాదిహామీ పనిదినాలను, రోజు వేతనం రూ. 600లకు పెంచాలని ఉపాధిహామీ పనిదినాలను 200రోజులకు పెంచాలన్నారు.పట్టణ ప్రాంతాల లోనూ ఉపాధి హామీ చట్టం అమలుచేయాలని వలస కార్మికులకు సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు.

 కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు  పెద్దు వాసుదేవరావు, దొంతు చిన్నా, కాట్రగడ్డ జోషి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.