దారి మళ్ళిన రూ.300 కోట్ల మద్యం ఆదాయం : తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సంచలన ఆరోపణ
శ్రీకాకుళం : వి న్యూస్ : సెప్టెంబర్ 21:
ఈ నెల 14న విశాఖ నుంచి ముంబై ప్రత్యేక విమానంలో తరలింపు
ఈ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు తరలించారో లెక్క తేలాలి
తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సంచలన ఆరోపణ
మద్యం అమ్మకాలలో వచ్చిన ఆదాయం సుమారు 300 కోట్ల రూపాయలను అక్రమంగా విశాఖ నుంచి ముంబైకి తరలించారని.. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. శ్రీకాకుళం లోని హోటల్ నాగవళి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగానే నగదు అక్రమ తరలింపు కొనసాగిందన్నారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులను బనాయించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంపై వచ్చిన ఆదాయాన్ని హవాలా రూపంలో తరలిస్తోందని ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ముంబైకి 300 కోట్ల రూపాయలను తరలించారన్నారు. ఆ ప్రత్యేక విమానంలో ఎవరు ప్రయాణించారో..? ఈ విధంగా ఎన్నిసార్లు ఎన్ని వందల కోట్ల రూపాయలు తరలించారో..? నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు బయటపడాలంటే తక్షణమే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక విమానంలో నగదు తరలింపు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వివరణ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా డిజిటల్ నగదు లావాదేవీలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా మద్యం అమ్మకాల విషయంలో డిజిటల్ లావాదేవీలు కాకుండా కేవలం నగదు ద్వారానే లావాదేవీలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా వార్షిక ఆదాయం 58 వేల కోట్ల రూపాయలు సమకూరుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే చూపిస్తోందన్నారు. అంటే మిగిలిన 26 వేల కోట్ల రూపాయలు ఎటు వెళుతున్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉందన్నారు.
మంత్రి సీదరి అప్పలరాజు ముఖాముఖీ కి సిద్ధమా..?
సీదరి అప్పలరాజుతో పాటు రాష్ట్ర మంత్రులు తమ బాధ్యతలను మరిచి చంద్రబాబు నాయుడును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై విమర్శలు చేయడం కాకుండా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి మంత్రి సీదరి అప్పలరాజు శ్రీకాకుళం లోనే తనతో ముఖాముఖికి రాగలరా..?అని రామ్ సవాల్ చేశారు.
ఈ సమావేశం లో గాలి వెంకటరెడ్డి, బోడేపూడి దొరబాబు, ఎల్.వేణు గోపాల్, ఏ రాంబాబు, ఎర్రయ్య, శ్రీరాములు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ఎచ్చెర్ల నియోజకవర్గంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అక్రమరాష్ట్రకు నిరసనగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ శిబిరంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సంఘీభావం తెలియజేశారు.