ఏపీలో 27 లక్షల ఓట్ల తనిఖీ : ఎంపీ రఘురామ లేఖపై స్పందించిన ఈసీ.
అమరావతి : వి న్యూస్:సెప్టెంబర్ 13:
ఒకే డోర్ నెంబర్‌లో 10మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాల సంఖ్య 1,57,939గా ఎన్నికల సంఘం తేల్చింది. ఇందులో 24,61,676 మంది ఓటర్లు ఉంటున్నట్టుగా తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ కృష్ణ రాజు రాసిన లేఖ మేరకు ఏపీలో ఓటర్ల సంఖ్యపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమాధానం ఇచ్చారు. గుర్తు తెలియని డోర్ నెంబర్లు, జీరో నెంబర్లపైనా 2,51,767 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో 27 లక్షల 13 వేల పైచిలుకు ఓట్లకు సంబంధించిన తనిఖీ జరుగుతున్నట్టు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఒకే డోర్ నెంబర్, జీరో డోర్ నెంబర్ సహా ఒకే ఇంటి నెంబరు పై 10 మంది ఓటర్లు కలిగిన కేసుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని స్పష్టం చేశారు. బీఎల్ఓలు వెరిఫికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నట్టు తెలిపారు. మరోవైపు నకిలీ, జీరో డోర్ నెంబర్ కు సంబంధించిన ఓటర్ జాబితాల తనిఖీ ప్రక్రియలో ఇప్పటి వరకూ 61,374 ఓట్లు సరిచేశామని పేర్కోన్నారు. మిగతా 1,90,393 ఓట్లను తనిఖీ చేయాల్సి ఉందని వెల్లడించారు. సింగిల్ డోర్ నెంబరుపై 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న లక్షా 57 వేల గృహాలకు గానూ 21, 347 గృహాల తనిఖీ పూర్తి అయ్యిందని సీఈఓ స్పష్టం చేశారు. దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపట్టామని లేఖలో వివరించారు.

