సమాచారహక్కు సామాన్యుల ఆయుధం.

సమాచారహక్కు సామాన్యుల ఆయుధం.

ప్రభుత్వ పాలనకు సంబంధించిన, వెలుగులోకిరాని అనేక అంశాలను గూర్చి తెలుసుకోవడానికి సమాచారహక్కు సామాన్య ప్రజలకు సైతం ఆయుధంగా మారింది. దానిని గూర్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ 19లో అంతర్గంగా పొందుపరిచారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలకులు తీసుకొనే నిర్ణయాలు, వాటిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారనే సమాచారం తదితర విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. అలా తెలపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను సమాచార హక్కు ద్వారా ప్రజలు తెలుకునే అవకాశం ఉండాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఫైళ్లు, డాక్యుమెంట్లు, రిపోర్టులు, నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరు మొదలైన అంశాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం పారదర్శకతతో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేకపోతే అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం-2005 సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంటు 2005లో రూపొందించింది. జూన్ 15, 2005లో రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేశారు. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పాలనలో పారదర్శకతను సాధించడమే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. 

#ముఖ్యాంశాలు: 

• ఈ చట్టం ప్రకారం ప్రతి శాఖలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించడమే ఆయన ప్రధాన బాధ్యత. 

• సాధారణ సమాచారమైతే 30 రోజల్లోగా, జీవించే హక్కుకు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లో ఇవ్వాలి. దీనికోసం నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. 

• ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో అధికారులు విఫలమైతే వారిపై వచ్చే ఫిర్యాదులను సమాచార కమిషన్లు విచారిస్తాయి. 

• చట్టం నిర్దేశించిన మేరకు సమాచారం అందించని అధికారులకు నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 25 వేల వరకు జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.