క్షేత్రస్థాయి అధికారులు ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని పెదనాగమయ్యపాలెం గ్రామస్తులు ఆందోళన.

 క్షేత్రస్థాయి అధికారులు ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని పెదనాగమయ్యపాలెం గ్రామస్తులు ఆందోళన.

పెదనాగమయ్యపాలెం:

స్పందనలో  సర్పంచ్, క్షేత్రస్థాయి అధికారులు ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థలంతా వినతి పత్రాలు అందించినా బేఖాతరు చేస్తున్నారని విశాఖ జిల్లా పెదనాగమయ్యపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెదనాగమయ్యపాలెంలో జలజీవన్ మిషన్ లో భాగంగా బోర్లు వేసే నిర్ణయాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎవరి ఆదేశాల మేరకు సర్పంచ్, క్షేత్రస్థాయి అధికారులు పైపులు వేశారని గ్రామస్తులు మండిపడ్డారు. ఓవైపు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా గ్రామస్తులకు తెలియపరచకుండా పైపులు దొంగ చాటున వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్పంచ్ తో పాటు క్షేత్రస్థాయి అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో  భవిష్యత్ తరాలకు ఉప్పునీరే గతౌవుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక సర్పంచ్ బొడ్డు సత్తెమ్మ కుమారుడు బొడ్డు దుర్గారావు ఏకపక్ష నిర్ణయాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో 15 అడుగుల లోపే త్రాగునీరు పడేదని ప్రస్తుతం 40 అడుగులు దాటితేనే నీరు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. గతంలో బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు దత్తత గ్రామంగా ఇంటింటికి కొళాయిలు వేసారని ప్రస్తుతం  గ్రామంలో త్రాగునీటికీ కొరత లేదన్నారు. త్రాగునీటి కొరత లేకపోయినా గ్రామంలో జలజీవన్ మిషన్ బోర్లు వేయడం ఎవరి స్వార్థం కోసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కు స్పందనలో గ్రామస్తులంతా ఐక్యమై ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ సర్పంచ్ కుమారుడు బొడ్డు దుర్గారావు, ఎంపీపీ వాసురాజు  తో కలిసి గ్రామస్థులకు నష్టం కల్పిస్తున్నారన్నారు. పెద్దనాగమయ్యపాలెం పంచాయతీ పరిధిలో పాతపాలెం, జీరుపాలెం, చిన్న నాగమయ్యపాలెం కుగ్రామాల్లో ఎక్కడ జలజీవన్ బోర్లు వేసినా ఇబ్బందిలేదని పెదనాగమయ్యపాలెం గ్రామస్తులు తెగేసి చెప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గ్రామంలో బోర్లు వేస్తే పంచాయతీ, మండలపరిషత్ జిల్లా కార్యాలయంలో సైతం ఆందోళన చేసేందుకు వెనుకాడబోమని ముక్తకంఠంతో తెలిపారు. ఆందోళనలో గ్రామ పెద్దలు గరికిన పరశురాం, దూడ ధనంకొండ, దూడ పోలయ్య, బడే ఎల్లారావు, గరికిన అప్పయ్యతాత, మైలపల్లి ప్రసాద్, గరికిన అచ్యుతరావు, వాసుపల్లి అప్పారావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.