అబ్బిరెడ్డి" సోదరుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం

 *"అబ్బిరెడ్డి" సోదరుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం*


*గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్త జనం


*తమ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని గణేషుని, పరమేశ్వరుని ప్రార్థించిన అబ్బిరెడ్డి సోదరులు*


మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్ సెప్టెంబర్ 11:

"దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు, అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అటువంటి అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం స్వయంకృషి నగర్ లో "అబ్బిరెడ్డి" సోదరులు నిర్వహించారు.


మనం చేసే దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడని పురాణ ఆధారాలున్నాయని అబ్బిరెడ్డి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం 5వ వార్డు పరిధిలో గల కొమ్మాది జంక్షన్ స్వయంకృషి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక పూజ మహోత్సవాల్లో భాగంగా అబ్బిరెడ్డి సోదరులు ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి భీమిలి సమన్వయ కర్త ముత్తంశెట్టి మహేష్, వైఎస్సార్సీపి 5వ వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు, భీమిలి మార్కెట్ కమిటీ బోర్డ్ మెంబర్ జే.ఎస్.రెడ్డి వరసిద్ధి వినాయకుని నమస్కరించి ఆశీస్సులు పొందారు. 
అనంతరం చేపట్టిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 2000 మంది పైగా గణేశుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గణేశ నవరాత్రుల్లో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించటం, దానికి భక్తులు యావన్మంది విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం తమకు సంతోషాన్ని కల్గించిందని అబ్బిరెడ్డి సురేష్, కలర్ ఫుల్ యూత్, గణేశ మండప కమిటీ సభ్యులు తెలియచేశారు. అబ్బిరెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యుపకారము ఆశించకుండా చేసే దానం అత్యున్నతమైందని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, జీవ కోటికి మనుగడకు అన్నం ముఖ్యమైనదని, ఎటువంటి లోటు లేకుండా అన్నం భుజించడానికి సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలని అన్నారు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని తెలిపారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న మహాలయ పక్షంలో ఇటువంటి అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం తమ పూర్వ జన్మ సుకృతం అని, తమ తల్లి దండ్రుల ఆత్మలకు సకల దేవతలు శాంతిని చేకూర్చాలని ఆయన ఆశించారు. ఈ అన్న ప్రసాద ఫలితం కూడా వారికే దక్కాలని గణేషుని, పరమేశ్వరుని ప్రార్థించారు.