వీధి కుక్కల ఆదరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ:
ఢిల్లీ: వీధి కుక్కలను ఆదరించేవాళ్లకు సుప్రీం కోర్టు ఇవాళ(శనివారం) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీరోజూ దానికి తిండిపెట్టడమే కాదు..వ్యాక్సినేషన్ వేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేసింది. అంతేకాదు.. ఒకవేళ అవి గనుక ఎవరినైనా కరిస్తే, ఆ పరిణామాలకూ వాటిని ఆదరించేవాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
మూగజీవాల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. వీధికుక్కలను ఆదరించి.. తిండి పెట్టేవాళ్లూ వాటి బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఎవరి మీదైనా దాడి చేస్తే గనుక.. ఆ ఘటనలకు వాళ్లే బాధ్యలవుతారు అంటూ బెంచ్ పేర్కొంది. అయితే.. మానవతా కోణంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగోనాల్సిన అవసరం ఉందంటూ ఇరు పార్టీలకు ధర్మాసనం సూచించింది.
''నేను కూడా డాగ్ లవర్‌నే. రోడ్ల మీద కనిపిస్తే జాలితో, ప్రేమతో వాటికి ఏదైనా తిండి పెడతా. అలాగని కీలకమైన అంశాలను నిర్లక్ష్యంగా వదిలేయకూడదు కదా!. దేశంలో జరుగుతున్న ఘటనలనూ కూడా పరిగణనలోకి తీసుకుంటాం'' అని జస్టిస్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగోనాల్సి ఉందన్న ఆయన.. సెప్టెంబర్ 28కి తదుపరి విచారణ వాయిదా వేస్తూ.. ఈలోపు పరిష్కార దిశగా ప్రయత్నించాలంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. 2019 నుంచి దేశంలో 1.5 కోట్ల మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో కేసులు, ఆపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పెంపుడు కుక్కలంటే.. వీధికుక్కల దాడులే ఎక్కువగా ఉన్నాయి. కేరళ, ముంబైలలో పెనుముప్పుగా మారిన వీధికుక్కల దాడులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వ సంబంధిత పౌర విభాగాలు.. వాటిని చంపించడంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో పలు పిటిషన్లు నమోదుకాగా.. వాటిని కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో మూగజీవాల సంరక్షణ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది అత్యున్నత న్యాయస్థానం. ఇదిలా ఉంటే.. దేశంలో మణిపూర్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలిలో వీధి కుక్కల సంఖ్య సున్నాగా ఉందని అక్కడి అధికార యంత్రాంగాలు ప్రకటించుకున్నాయి.

