జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.

తూర్పు గోదావరి:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొంటున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొంటున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పవన్ కల్యాణ్ మండపేటకు బయలుదేరారు. మార్గమధ్యలో కౌలు రైతుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మండపేటలో జరిగే జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.

ఇక, ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారని జనసేన నేతలు తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న దాదాపు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించనున్నారని చెప్పారు.

మరోవైపు గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ శ్రేణులు.. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగానే ఉన్నాయని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.