ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ భేటీ - లాస్ట్ మీట్ : ఇద్దరు మంత్రుల కొనసాగింపు : స్పీకర్ -విప్ ల మార్పు..!!

 ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ భేటీ - లాస్ట్ మీట్ : ఇద్దరు మంత్రుల కొనసాగింపు : స్పీకర్ -విప్ ల మార్పు..!!

విశాఖపట్నం ప్రతినిధి

తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూనే..సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ప్రారంభం కానున్నాయి. అదే విధంగా రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెరగనుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న వేళ.. అటు ప్రభుత్వం..ఇటు పార్టీలో కీలక మార్పుల దిశగా సీఎం జగన్ నిర్ణయాలు వేగవంతం చేసారు. కొంత కాలంగా సాగుతున్న కేబినెట్ విస్తరణ ప్రచారం పైన నిర్ణయం అమలుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని శాఖలకు సమాచారం అందింది. ఆ రోజున సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ పైన ఓపెన్ గా మంత్రులతో డిస్కస్ చేయటంతో పాటుగా పూర్తి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

ప్రస్తుత మంత్రులకు లాస్ట్ మీట్
ఇప్పటికే సీఎం జగన్ కేబినెట్ విస్తరణ గురించి మంత్రులకు స్పష్టత ఇచ్చారు. ప్రక్షాళన తప్పదని తేల్చి చెప్పారు. అయితే, ఎవరిని కొనసాగిస్తారనే అంశం పైన తుది రూపు ఇవ్వలేదు. ఈ సమావేశంలో ఎవరిని కొనసాగించాలి.. వారి విషయంలో ఎందుకు మినహాయింపు అనే అంశం పైనా మంత్రులతో ఓపెన్ గా చెబుతారని సమాచారం. దీని ద్వారా ఏ ఒక్క మంత్రిలోనూ తమను తొలిగించి మరొకరికి ప్రాధాన్యత కొనసాగించారనే అభిప్రాయం లేకుండా సీఎం మంత్రులకు వివరిస్తారని చెబుతున్నారు. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు సీనియర్ మంత్రుల తో సీఎం జగన్ నేరుగా ప్రక్షాళన గురించి తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. మంత్రి వర్గం నుంచి ఎందుకు తప్పించాల్సి వస్తుందనే అంశం పైనా స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ ఇద్దరూ కొనసాగింపు

ప్రస్తుత కేబినెట్ లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొనసాగుతారని తెలుస్తోంది. అనంతపురం - కర్నూలు జిల్లాల్లో బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండటంతో..ప్రస్తుతం మంత్రిగా ఉన్న జయరాములను కర్నూలు జిల్లా నుంచి కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కర్నూలు జిల్లా నుంచి ఆర్దిక మంత్రి బుగ్గన స్థానంలో శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఇక, గోదావరి జిల్లాల్లో శెట్టి బిలజ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణను కొనసాగించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శెట్టి బిలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తొలుత మండలి నుంచి కేబినెట్ లోకి..ఆ తరువాత రాజ్యసభకు నామినేట్ చేసారు. ఆ స్థానంలో వేణుకు అవకాశం ఇచ్చారు.

స్పీకర్ - విప్ ల మార్పు.. మంత్రులుగా
అయితే, వేణు మంత్రిగా 2020, జూలై 22న ప్రమాణ స్వీకారం చేసారు. అంటే ప్రస్తుత మంత్రుల కంటే ఏడాది తరువాత కేబినెట్ లో అడుగు పెట్టారు. అయితే, అప్పలరాజు సైతం మంత్రి పదవి అప్పుడే చేపట్టినా.. శ్రీకాకుళం జిల్లా సమీకరణాల్లో భాగంగా అప్పలరాజును తప్పించి..ఆ జిల్లా నుంచి ధర్మాన ప్రసాద రావు - ప్రస్తుత స్పీకర్ తమ్మినేనికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. స్పీకర్ స్థానం ఎస్టీ వర్గానికి చెందిన రాజన్న దొర పేరు ప్రచారంలో ఉంది. ఇక, వీటన్నింటి పైనా జగన్ కేబినెట్ సమావేశంలోగా తుది రూపు ఇచ్చి... మంత్రులకు ఏప్రిల్ 7వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా తరువాత క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

గవర్నర్ తో భేటీ.. ముహూర్తం ఫిక్స్
8వ తేదీన సీఎం జగన్ గవర్నర్ తో సమావేశం కానున్నారు. 11న మంత్రివర్గ విస్తరణ కు ముందుగానే గవర్నర్ కు సమాచారం ఇవ్వనున్నారు. 11న పాత - కొత్త మంత్రులకు సీఎం జగన్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక, మంత్రి పదవులు పూర్తి చేస్తూనే ప్రస్తుతం ఉన్న విప్ లను మార్చే విధంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విప్ లుగా ఉన్న వారిలో దాటిశెట్టి రాజా .. ముత్యాల నాయుడు కేబినెట్ రేసులో ఉన్నారు. ఈ సారి మహిళలకు విప్ పదవులు ఇవ్వనున్నారు. దీంతో..జగన్ ఎలంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ ప్రస్తుత మంత్రుల్లో.. ఎమ్మెల్యేల్లో ఉత్కంఠగా మారుతోంది.