దొడ్డిదారిన కొండ గ్రావెల్ తరలింపు..! --- ఇంత నిర్లక్ష్యమా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ప్రశ్న !
భీమిలి : వి న్యూస్ : డిసెంబర్ 01:
అధికారుల నిర్లక్ష్యమా..? రాజకీయ నాయకుల వత్తిల్లా..? ఎందుకు తవ్విన కొండ గ్రావెల్ తరలింపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అధికారులను ప్రశ్నించారు. భీమిలి జోన్ 3వ వార్డు గొల్లలపాలెం ఏరియా కస్తూరిభా బాలికల పాఠశాలను ఆనుకొని సర్వే నెంబర్ 87 లో 2ఎకరాలు కొండను కళ్యాణమండపానికి, సర్వే నెంబర్ 73లో ఒక స్వామీజి ఆశ్రమం కోసం 15 ఎకరాలు కొండను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గంటా నూకరాజు చెప్పారు. కొండను తవ్వగా వచ్చిన అతి విలువైన రెడ్ గ్రావెల్ ఎక్కడకు పోతుందో కనీసం అధికారులకు అయినా తెలుసా..? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఇదంతా ప్రజాధనం కాదా.. ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా అవసరం కోసం కళ్యాణ మండపం నిర్మించాడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని కానీ ప్రజా ధనాన్ని వృధా చేసేవిధంగా అధికారుల నిర్లక్ష్యం సరైనది కాదని అన్నారు. అదేవిదంగా స్వామీజీ కోసం కేటాయించిన కొండపై ఎటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి, ఎంతవరకు మట్టి తవ్వుతున్నారు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహారిస్తున్నారా, తవ్విన రెడ్ గ్రావెల్ ఎక్కడ పోస్తున్నారు, ఎక్కడకు తరలిపోతుంది, ఎవరు దాని వెనుక ఉన్నారు వంటి ఆలోచన పర్యవేక్షణ అధికారులకు లేదా..? అని అడిగారు. నిద్రపోతున్న అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలని, ఏమి జరుగుతుందో కళ్ళు తెరిచి చూడాలని అన్నారు. ఉన్నతమైన బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి ప్రజా ధనం పక్కత్రోవ పెడితే కాపాడవలసిన బాధ్యత ఉందన్న సంగతి మర్చిపోకూడదని అన్నారు. ఇప్పటికైనా పునరాలోచన చేసి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న పనుల విషయంలో పర్యవేక్షణ చేయాలని గంటా నూకరాజు డిమాండ్ చేసారు.

