ఆత్మగౌరవ సభకు తక్షణమే అనుమతి ఇవ్వాలి:జాయింట్ కలెక్టర్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విజ్ఞప్తి
విశాఖపట్నం: వి న్యూస్ :సెప్టెంబర్ 16:-
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. రామకృష్ణ బీచ్ లో ఆదివారం సాయంత్రం ఆత్మగౌరవ సభ పేరిట నిర్వహించే బహిరంగ సభకు ఇంతవరకు అనుమతులు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ కే.ఏ.విశ్వనాథన్ ను కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో కలిసిన సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం కేవలం ఐదేళ్ల పాటు అధికారంలోకి ఉంటుందని.. కానీ అధికారులు 30 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అధికారుల తీరు పూర్తిగా మారి పోయిందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవని, ఇప్పటికైనా స్పందించి ఆత్మగౌరవ సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే తాను ఆత్మగౌరవ సభను నిర్వహించాలని భావిస్తున్నానన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని కాదని కేవలం ఒక భారతీయుడిగా ప్రజల హక్కుల కోసం వారిని చైతన్య పరచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని బి.వి.రామ్ తెలిపారు.

