జగ్గంపేట వి న్యూస్: ఆగస్ట్ 11 ::::
విద్యార్థిని విద్యార్థులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి మీ బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని జగ్గంపేట ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి,జగ్గంపేట సీఐ సూర్య అప్పారావు ఉత్తర్వుల ప్రకారం జగ్గంపేటలోని శ్రీ స్వామి వివేకానంద విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎస్సై విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులంతా చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.చెడు వ్యసనాలకు బానిస కాకుండా నడుచుకోవాలన్నారు. విద్యార్థుల క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ నడుచుకోవాలన్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.ముఖ్యంగా ఫేస్బుక్,వాట్సాప్ లో పరిచయమయే వ్యక్తులను నమ్మరాదని తెలిపారు. అదేవిధంగా గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలన్నారు. నిషేధిత పదార్థాలతో దొరికితే పోలీసుల కేసులు పెట్టడం ద్వారా మీ భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. అదే విధంగా ర్యాగింగ్ కు పాల్పడరాదన్నారు. విద్యార్థులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఆపద సమయాల్లో దిశ యాప్ గాని ఎస్.ఓ.ఎస్ బటన్ గాని ప్రెస్ చేసి సురక్షితంగా బయటపడాలన్నారు. అదేవిధంగా క్రీడల పట్ల మక్కువతో క్రీడల్లో రాణిస్తే వాటి ద్వారా వచ్చే సర్టిఫికెట్లు భవిష్యత్తులో మీకు వచ్చే ఉద్యోగానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివిధ రకాలుగా సూచించిన రోడ్డు ప్రమాదాలు, వారధి కార్యక్రమం, సైబర్ నేరాలపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీడియో ప్రజెంటేషన్ చేసి విద్యార్థులకు ఎస్ఐ విద్యాసాగర్ వివరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యాసంస్థల సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.