ఘనంగా ప్రపంచ వ్యవసాయ కూలీల పోరాట దినోత్సవం
భూమికోసం, భుక్తి కోసం ఐక్య పోరాటాలు.
నిత్యావసరాలు,పెట్రో ఉత్పత్తి ధరలు తగ్గించాలి
నిరుపేదలకు భూ పంపిణీ చేయాలి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ కన్వీనర్లు బుడుపుల జయశ్రీ, భూక్య రంగా.
నూజివీడు(వి న్యూస్ ప్రతినిధి): 30
ప్రపంచ వ్యవసాయ కూలీల పోరాట దినోత్సవాన్ని ముసునూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ కన్వీనర్లు బుడుపుల జయశ్రీ, భూక్య రంగా లు మాట్లాడుతూ పేదలకు భూమి కోసం, భుక్తి కోసం సమైక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆహార భద్రత భూమిహక్కు పర్యావరణ సమతుల్యత సాధన కోసం గ్రామీణ వ్యవసాయ కూలీలు ఇతర వృత్తుల వారందరము ఐక్యం కావాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా రేషన్ బియ్యం కోసం ఇప్పటికీ పేదలు క్యూ లైన్ లలో నిలబడటం చూస్తుంటే పేదరికం ఏమాత్రం దేశం నుండి వెళ్లిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని సంపాదనతో అరాకొర ఆకలి తీర్చుకుంటున్న నిరుపేద కుటుంబాలు ప్రభుత్వాలకు కనిపించడం లేదని వాపోయారు. ఆహార భద్రత పేరుతో ప్రజా పంపిణీ ద్వారా నెలకు 5 కిలోల బియ్యం మాత్రమే అందిస్తోందన్నారు.
ధనిక రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసి వారి లబ్ధి చేకూర్చడానికే పాలకులు పాటుపడుతున్నారని తెలిపారు. ఆహార హక్కు చట్టం అమలు చేయాలని ఒక వ్యక్తికి కనీసం 7 కిలోలు ఆహార ధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఏడు కిలోల బియ్యం పంపిణీ పై ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఐదు కిలోలే క్షేత్రస్థాయిలో పంపిణీ అమలవుతోందన్నారు. ఈ 5 కిలోలు పది రోజులు కూడా సరిపోవని, ఆ తరువాత అధిక ధరలకు సరిపడా బియ్యం కొనుగోలు చేసి తినవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు ఎన్ని రేట్లు పెరిగినా అడిగే దిక్కులేదన్నారు. ప్రభుత్వమే ధరలు పెంచుతుంటే వ్యాపారస్తులు మాత్రం పెంచకుండా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ బండ ధర 7 సంవత్సరాల క్రిందట 400 రూపాయలు ఉండగా,నేడు 1200 రూపాయలు ధర పలుకుతోందని వాపోయారు. కిరోసిన్ 70 రూపాయలు, పెట్రోలు డీజిల్ 3 రెట్లకు పైగా పెరగడంతో అన్ని సరుకులు ధరలు 3-4 రెట్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూనెలు, పప్పులు 50 రూపాయల నుండి 200 రూపాయలు ఎగబాకాయని, గ్రామాల్లో కూడా నీటిని కొని తాగే దుస్థితి ఏర్పడిందన్నారు. సొంత వనరులు లేని కూలీలు ప్రతిదీ కొనుక్కోవాల్సిందే, కేవలం కూలీలపై ఆధారపడి చాలీచాలని సంపాదనతో బతుకుతున్న పేదలకు మూడు పూటల ఆహారం అందడం అసాధ్యం గా మారుతుందన్నారు. సొంత వనరులు లేక కొని తినలేక పస్తులు ఉండడం వలస పోవడమే తప్ప గత్యంతరం లేదన్నారు. తరతరాలుగా కూలి పై మాత్రమే ఆధారపడుతున్న భూమిలేని పేదలందరికీ భూమి ఉండి తమకు కావలసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తామే స్వయంగా సమకూర్చుకొ గలిగినప్పుడే జాతీయ ఆహార భద్రత సాధ్యమవుతుందన్నారు.
( జాత" మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం తో మొదలైన మార్చ్ 29 భూమిలేని వ్యవసాయ కూలీల పోరాట దినంతో కొనసాగించి దళిత ఆదివాసుల హక్కుల సాధన కోసం ఏప్రిల్ 14 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకొని అసంఘటిత కార్మికుల జీవనోపాధి మరియు సాంఘిక భద్రత కోసం మే నెల 1న ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నాడు వ్యవసాయ కూలీల డిమాండ్లను కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీల పోరాట దినం సందర్భంగా ప్రభుత్వము ముందు ఉంచుతున్న డిమాండ్లు, ప్రజా పంపిణీ ద్వారా బియ్యంతో పాటు చిరు(సిరి)ధాన్యాలు అన్ని నిత్యవసర వస్తువులు సబ్సిడీ ధరల్లో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్(14కిలో ) ₹400/- కు ఇవ్వాలి, కిరోసిన్ లీటర్ పది రూపాయలకే ఇవ్వాలి,అన్ని గ్రామాల్లో ఉచిత రక్షణ త్రాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలి, భూ సంస్కరణలు అమలు చేసి దళిత ఆదివాసులతో పాటు భూమిలేని గ్రామ బడుగు బలహీన వర్గాల మహిళలకు 5 ఎకరాల (2.5 హెక్టార్లు )కు తగ్గకుండా సాగు యోగ్యమైన భూములు పంచాలి, వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన మౌలిక వసతులు కల్పించాలి, ఆదివాసి భూములు పరా దీనం కాకుండా 1/70 అమలు చేసి కాపాడాలి, 9/77భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని ఉపయోగించి పరాదినమైన ప్రభుత్వ భూములు తిరిగి పేదలకే పంచాలి, అటవీ భూములపై హక్కు చట్టాన్ని అమలు చేసి ఆదివాసులకు పోడు భూములు పట్టాలు పంపిణీ చేయాలి, ఆదివాసీల స్వపరిపాలన హక్కును ఇస్తున్న చట్టం అమలు చేయాలి, రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పెంచాలి, సాంప్రదాయ జీవనోపాదుల భద్రత కోసం సముద్ర తీర మత్యకారులకు చేపల వేట జీవనోపాధి పై హక్కు కల్పిస్తూ చట్టం తేవాలి, వ్యవసాయ భూములను ప్రజా ప్రయోజనాల పేరుతో స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వ్యవసాయ కూలీలకు 10 సంవత్సరాల కనీస వేతనం పరిహారంగా చెల్లించాలి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏదేమైనా ప్రైవేట్ సంస్థలను స్థాపించడానికి భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు కనీసం 80% బాధిత కుటుంబాల సమ్మతి తప్పనిసరి మార్కెట్ ధరకు 3 రెట్లు పరిహారం చెల్లించాలి, భూసేకరణ చట్టం ప్రకారం కేటాయించిన భూములను కంపెనీలు మూడు సంవత్సరముల లోపల ఉపయోగించని సందర్భంలో సదరు భూములను భూమిలేని వ్యవసాయ కూలీలకు పంచాలి, గ్రామీణ పేదలకు ప్రభుత్వం పూర్తి ఆర్థిక సహాయంతో ఇల్లు కట్టించాలి, వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన 27 క్రిమి సహకార పురుగుమందులు మనదేశంలో కూడా తక్షణమే నిషేధించాలి, జీవ ఎరువులు జీవ మందులు వినియోగాన్ని ప్రోత్సహిస్తూ చిన్న సన్న కారు రైతులకు ఆర్థిక సహకారం అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూమిలేని మహిళ లు, నిరుపేదలు, బాణావతు సక్రి, మోదుగు లక్ష్మి, బాణావతు పంగిడి, జుజ్జువరపు స్వాతి, సిహెచ్ లక్ష్మి , నూజివీడు మండల పరిధిలోని సిద్ధార్థ నగర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.


