జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. సరైన రోడ్డు సౌకర్యం లేదు!
అల్లూరి సీతారామరాజు జిల్లా:
నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లివరం గ్రామంలో నేటికీ సరైనా రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామం జిల్లా కేంద్రానికి ఆమడదూరంలో ఉన్నా గానీ ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని వంకే చూడట్లేదు అని అక్కడున్న గిరిజనులు వాపోతున్నారు. ఇలాంటి రహదారి పైనే తాము రాకపోకలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడానికి కారణం.. అధికారుల నిర్లక్ష్యమో! లేక గిరిజనుల దురదృష్టమో!! తెలియదు కానీ వీరు పడుతున్న కష్టాలు మాత్రం ఇంత అంతా కాదు. ప్రభుత్వ అధికారులు మారుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు గానీ గిరిజనుల గ్రామాలకు వెళ్లే, గొయ్యిలు ఏర్పడిన మట్టి రోడ్డులు మాత్రం తారు రోడ్డులుగా మారట్లేదు. స్వాంతంత్ర్యం వచ్చి అనేక సంవత్సరాలు గడుస్తున్నా, ఇలాంటి గిరిజనుల గ్రామాలకు మాత్రం సరైన రహదారులు కూడా లేవు. అనేకమార్లు ప్రభుత్వం తారు రోడ్డుకి నిధులు మంజూరు అయ్యింది అని చెప్పడం తప్పించి, మా గ్రామాలలో తారు రోడ్లు వేసిన దాఖలాలే లేవు అని మూడు గ్రామాల గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈ రహదారులు పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడి ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈ రహదారి కోసం స్పందన కార్యక్రమంలో వినతలు సమర్పించిన ఫలితం శూన్యం అని ఈ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా వనగరాయి, అల్లివరం, సప్పిపుట్టు, జోడిమామిడి, కాండ్రంగిపాడు, నరంగిబడి వెళ్లే ఘాట్ రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఈ గ్రామాల్లో పని చేస్తున్న ఆష కార్యకర్తలు గర్భిణీ స్త్రీలను స్కేనింగ్, చెకప్స్ కి పాడేరు మాత శిశు సంరక్షణ కేంద్రంలో, మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మరియు తుంపాడ ఆరోగ్య ఉప కేంద్రంలో వాహనాలు మీద తీసుకెళ్లడం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా అత్యవసర సమయంలో డెలివరీ కేసులను ఆసుపత్రికి తరలించే సమయంలో ఏ ఎన్ ఎం, ఆష మరియు అంబులెన్స్ సిబ్బంది వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు. గతంలో ఈ ఘాట్ నుంచి రెండు వాహనాలు లోయలోకి వెళ్లిపోయాయి. దీంతో ఈ మార్గంలో గిరిజనులు వాహన రాకపోకలు కొనసాగించడానికి ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలి అని మూడు గ్రామాల స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

