మునిగిన బెంగళూరు: జల విలయంలో సిలికాన్‌ వ్యాలీ.. 24 గంటల్లో 20 సెం.మీ.ల వాన

మునిగిన బెంగళూరు

బెంగళూరు:

జల విలయంలో సిలికాన్‌ వ్యాలీ.. 24 గంటల్లో 20 సెం.మీ.ల వాన

మెట్రోల మునక కేంద్ర సర్కారు పాపమే

సిటీల అభివృద్ధిపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం

సీఎం కేసీఆర్‌ సూచనలు పట్టని ప్రధాని

నాడు హైదరాబాద్‌లో 32 సెం.మీ.ల వాన

ఆ విపత్తుపై బురద రాజకీయం చేసిన బీజేపీ

నేడు కిక్కురుమనని కాషాయ పార్టీ నేతలు

ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ సముద్రాన్ని తలపిస్తున్నది.

భారీ వర్షాలకు బెంగళూరు నగరం దాదాపు పూర్తిగా నీటమునిగింది. అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌ అతలాకుతలమైంది. ఆదివారం సుమారు 20.44 సెంటీమీటర్ల వర్షం పడటంతో నగరంలో ఎక్కడ చూసినా వరదనీరే.

రెండేండ్ల క్రితం హైదరాబాద్‌ను భారీ వర్షాలు వణికించాయి. గత వంద సంవత్సరాల్లో రెండో అత్యధిక వర్షపాతం 32 సెంటీమీటర్లతో అనేక ప్రాంతాల్ని వరద ముంచెత్తింది.

బెంగళూర్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్‌ 5 హైదరాబాద్‌ వరదలపై బీజేపీ నేతలు చేసిన బురద రాజకీయం ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. బెంగళూరుకు చెందిన బీజేపీ నేతలు కూడా కొందరు ఇష్టారీతిన తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. నేడు అదే బీజేపీ పాలిత రాష్ట్రంలోని బెంగళూరు నగరం 20 సెంటీమీటర్ల వర్షానికే పూర్తిగా నీట మునగటానికి కారణం ఎవరు? బీజేపీ ప్రభుత్వమే ఈ వరదలకు కారణమని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తారా? వరదల్లో జనాలు అవస్థలు పడుతుంటే ఈ బురద రాజకీయాలే పరిష్కారమా?

బాధ్యత మరిచిన కేంద్రం
ప్రపంచ జనాభాలో 56.2 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారు. మనదేశంలో 34.47% జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నది. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో జనాభా భారీగా పెరుగుతున్నది. కానీ ఆ జనాభాకు సరిపోను మౌలిక వసతుల కల్పన అంతే వేగంగా జరగట్లేదు. ఉద్యోగ కల్పనలోనూ సంపద సృష్టలోనూ దేశానికి వెన్నెముకగా ఉన్న ఈ నగరాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఏనాడూ సరిగా పట్టించుకొన్న పాపాన పోలేదు.

నాడు గాయిగాయి.. నేడు నోర్లు మూత
2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఎక్కడో పాకిస్థాన్‌లో నీట మునిగిన ప్రాంతాల ఫొటోలను కూడా తీసుకొచ్చి.. ‘ఇదిగో.. ఈ జలమయమైన ప్రాంతం హైదరాబాదే’ అని దుర్మార్గ ప్రచారం చేశారు. నాడు హైదరాబాద్‌లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, నేడు బెంగళూరులో 20 సెంటీమీటర్ల వర్షానికే నగరం పూర్తిగా మునిగిపోయింది. బీజేపీ నేతలు నోరు మెదపట్లేదు.

ఎనిమిదేండ్ల కిందటే చెప్పిన సీఎం కేసీఆర్‌
ఆరు మెట్రో నగరాల అభివృద్ధిపై 2014లోనే సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి కొన్ని సూచనలు చేశారు. 2014, జూన్‌లో మోదీని కలిసిన సమయంలో 45 నిమిషాలపాటు మెట్రో నగరాల అభివృద్ధిపై కీలక సలహాలిచ్చారు. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కూడా ఇదే విజన్‌ను వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో నగరాల అభివృద్ధి జరగాలని, ఇందుకు అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. నగరాల అభివృద్ధికి ఏటా రూ.6 వేల కోట్ల చొప్పున కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతేమొత్తం సమకూర్చేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. మోదీ సర్కార్‌ మాత్రం వీటిలో ఒక్కటి కూడా పట్టించుకోలేదు.

బెంగళూరు మునక
కుండపోత వర్షంతో కర్ణాటక రాజధాని బెంగళూరు అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి మొదలైన భారీ వానలు సోమవారం కూడా తగ్గకపోవడంతో ప్రధాన రహదారులు నదులను తలపించాయి. నివాసాలు, ఐటీ కార్యాలయాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క వానకే బెంగళూరు మునిగిపోవడంపై నగరవాసులు అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘బెంగళూరులో ఇలాంటి పరిస్థితులే ఉంటే, అన్ని ఐటీ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అంతవరకు సర్కారు మేల్కొనేలాలేదు’ అని స్వర్ణాలీ ముజుందార్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ చెప్పారు.

నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలి

బెంగళూర్, సెప్టెంబర్‌ 5 నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలని, అందుకు అవసరమైన మూల ధనాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమకూర్చాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. బెంగళూరు నగరాన్ని వరదలు ముంచెత్తడంపై ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్టు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ కూడా రాసింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాయి.

అటువంటి నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, నీటి నిర్వహణ సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వశాఖ చూసుకోవాలి. పట్టణ ప్రణాళిక అమలులో మనకు సంసరణలు చాలా అవసరం. నేను చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. గతంలో ఇదే పరిస్థితి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొందరు బెంగళూరు నేతలు మనల్ని విమర్శించారు. కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి’ అని పేరొన్నారు.