పురాతన నాణేలు విశాఖ మ్యూజియంకు అప్పగింత.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 20/05/2022
విశాఖ మ్యూజియంకు పురాతన నాణేలను నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి నేతి వెంకట సూర్యనారాయణ మూర్తి శుక్రవారం అందించడం జరిగిందని జివిఎంసి అదనపు కమిషనర్ వై. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని లాసన్స్ బే కాలనీ కి చెందిన సూర్యనారాయణ మూర్తి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారిని, 1961 నుంచి నాణేలను సేకరించడం హాబీగా చేసుకున్నారని, ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అరుదైన నాణేలను సేకరించేవారిని, ప్రస్తుతం ఆయన వద్ద 50 దేశాలకు చెందిన 300 వరకు అరుదైన నాణేలు ఉన్నాయని తెలిపారు. వీటి చరిత్ర గూర్చి భావితరాల వారికి తెలిసేలా విశాఖ మ్యూజియంలో ఉండాలని ఆ నాణేలను అందజేశారు. ఈ నాణేలను విశాఖ మ్యూజియంలో జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్షీశ ఆదేశాల ప్రకారం భద్రపరచడంతో పాటు, సందర్శకులకు దర్శనార్థం ఉంచుతామని తెలిపారు.
