షాక్ కొడుతున్న కరెంటు చార్జీలను ప్రజలందరూ వ్యతిరేకించండి !
కొమ్మాది: మంగళవారం : అక్టోబరు 10 : వి న్యూస్ :
సర్దుబాటు చార్జీల బాదుడు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ప్రజలపై గుదిబండ విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
వెంటనే పెంచిన అన్ని రకాల విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలి సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్
మంగళవారం జీవీఎంసీ 5 వ వార్డు ఏరియాలో శివశక్తినగర్, శ్రీ లక్ష్మీ నగర్ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ సిపిఐ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలొన్న పార్టీ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్ కొడుతోందని, పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారన్నారు విద్యుత్ వాడకం పెరగకపోయినా ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీల పేరుతో మూడు పోట్లు పొడిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తున్నాయని గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి రూ.1400 కోట్ల భారం మోపిందని స్లాబులు మార్చేశారన్నారు. ప్రజల కళ్ళు కప్పి గత 10 ఏళ్ల నుంచి వాడుకున్న కరెంటుకు అప్పుడే బిల్లులు కట్టినప్పటికీ, మళ్లీ సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా రూ.6 వేల కోట్ల భారం వేశారు. గత నాలుగేళ్లలో రూ.25 వేల కోట్ల విద్యుత్ భారాలను ప్రజల నెత్తిన మోపారని, ఈ నెల బిల్లులో 2014 సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు మళ్ళీ యూనిట్ 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్తు యూనిట్కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంటుకు యూనిట్కు 40 పైసలు కలిపి మొత్తం యూనిట్కు 80 పైసలు చొప్పున జనం నెత్తిన గుదిబండ మోపారని గతంలో రెండేళ్ళకో, మూడేళ్లకో కరెంట్ చార్జీలు పెంచేవారు. మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిన జగన్ ప్రభుత్వం ఇక ప్రతి నెల వంటగ్యాస్ లాగానే కరెంటు చార్జీలు కూడా పెంచడానికి ఆదేశాలు ఇచ్చేశారు. కరెంట్కి బిల్లులే కాకుండా ఫిక్స్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు చార్జీలు ఇలా రకరకాల పేర్లు పెట్టి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అసలు చార్జీలకంటే కొసరు చార్జీలు ఎక్కువయ్యాయి.
ప్రపంచంలో కరెంటు చార్జీలు తగ్గాయి. గతంలో సోలార్ విద్యుత్ యూనిట్ రూ. 12లు ఉండగా, ఇప్పుడు ఉత్పత్తి ఖర్చు తగ్గి రూ. 2కు రేటు పడిపోయింది. ఆ మేరకు నిజంగా కరెంటు చార్జీలు తగ్గించాలి. అయినా తగ్గించకుండా ఎందుకు పెంచుతున్నారు? దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలే కారణం, విద్యుత్ రంగాన్ని అదానీ తదితర బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. మన రాష్ట్రంలో 30 సంవత్సరాల పాటు వ్యవసాయానికి అందించే విద్యుత్ మొత్తం తయారు చేసే ఒప్పందం అదానీ చేసుకున్నారు. విదేశాల బొగ్గు సరఫరా చేసేది, బొగ్గు రవాణా చేసే ఓడరేవులు నీవే. ఇప్పుడు తాజాగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీ అదానీ ప్రారంభించారు. ఇలా విద్యుత్ రంగం మొత్తం అదానీ, కార్పొరేట్ల గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు వారికి దోచిపెడుతున్నాయి. అందుకే మన జేబులు ఖాళీ చేస్తున్నారు. చార్జీలు పెంచుతున్నారు. పనిలో పనిగా పాలకుల జేబులు నింపుకుంటున్నారు. రాజకీయ అవినీతి పరులు, కార్పొరేట్లు, పాలకులు కుమ్మక్కై పోయారు. రెండు మూడు రూపాయలకు కొనాల్సిన విద్యుత్ను బహిరంగ మార్కెట్లో 10 నుండి 20 రూపాయలకు కొంటున్నారు. ఇందులోను భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నది. ఇటీవలనే నిబంధనలకు విరుద్ధంగా హిందూజా సంస్థకు 1200 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించారు. రేపో, మాపో సర్దుబాటు చార్జీల పేరుతో మళ్లీ ఈ భారం వేస్తారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్ ఎసరు పెట్టబోతున్నారు. 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడే వారందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానని మాట చెప్పి జగన్ మోసం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ను క్రమంగా నీరుగారుస్తున్నారు. చిరు వ్యాపారులకు విపరీతంగా రేట్లు పెంచారు. మున్సిపాలిటీలు వాడే కరెంటు బిల్లులు పరోక్షంగా జనం నెత్తినే పడతాయి. వ్యాపార సంస్థలు, పరిశ్రమలపై భారం పెరిగి అవి అంతిమంగా ప్రజలపైనే పడుతుంది.. మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంటికి, షాపుకు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. దానికి ఖర్చు ప్రతి కనెక్షన్పై సుమారు 13000 వరకు ఉంటుంది. అదాని కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని జనమే చెల్లించాలి. ఒకసారి కట్టమంటే జనం తిరగబడతారు. అందుకే నెలకు 120 నుండి 150 రూపాయల వరకు, పది సంవత్సరాలు పాటు వసూలు చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ మీటర్ వస్తే చిన్న బల్బులు రీడింగ్ లోకి వస్తాయి. ముందు డబ్బు చెల్లించి కరెంటు వినియోగించుకునేలా సెల్ఫోన్ మాదిరిగా ప్రీపెయిడ్ పద్ధతి కూడా వస్తుంది. ఏ గంట ఎంత కరెంటు వాడుతున్నామో లెక్క తెలుస్తుంది. భవిష్యత్తులో డిమాండ్ను బట్టి గంట, గంటకు ఒక్కొక్క రేటు నిర్ణయించే ప్రమాదం ఉంది. రాత్రిపూట ఎక్కువ రేటు ఉండే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ స్మార్ట్ మీటర్లు మన కొంపముంచుతాయి. ఈ మీటర్లతో అదానీ, ప్రభుత్వాలకే ప్రయోజనం. ప్రజలకు తీవ్ర నష్టం. పెను భారం అవుతుంది. అందుకే దీనిని ఆదిలోనే తిప్పికొట్టాలన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డి బేగం, బి పుస్ప, బి. వెంకటేశ్వరరావు, రవి, చిట్టిబాబు, చిన్నమ్మలు, ఎం ఎస్ పాత్రుడు, డి కైలాష్, నారాయణరావు, కాలీషా తదితరులతొ పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

