ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు సిగ్గు పడాలి: పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు సిగ్గు పడాలి: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి:( వి న్యూస్ ప్రతినిధి) సెప్టెంబర్ 16;

40 ఏళ్ల అనుభవమున్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.. సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. 

''ఇండియా భారత్‌ పేర్ల మార్పుపై దేశమంతా చర్చించుకుంటున్నారు. ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంది. బ్రిటీష్‌ వారికి భారత్‌ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చు. నేను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నా. 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చింది. రూల్‌ బుక్‌ (రాజ్యాంగం)ను ప్రజలంతా గుర్తుంచుకోవాలి. సనాతన ధర్మం.. తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంది. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుంది. ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయి. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయి. మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది. మన దేశం అన్ని ధర్మాలను స్వీకరించింది. రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వారి కోసమే ఇదంతా చెబుతున్నా'' అని పవన్‌ కల్యాణ్ వివరించారు.

వైకాపా నేతలకు కనువిప్పు కలిగించేందుకే రాజ్యాంగ ప్రతి తెచ్చానని పార్టీనేతలకు వివరించారు. ''అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కొందరి భావన. చేసేపని సరైందే అని ఐపీఎస్‌ అధికారులకు అనిపిస్తుందా? ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గు పడాలి. మమ్మల్ని ఎన్నితిట్టినా భరించాం. పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సొంత రాష్ట్రానికి రాకుండా నన్ను అడ్డుకున్నారు'' అని పవన్‌ అవేదన వ్యక్తం చేశారు..