శోభాయ మానంగా శోభకృత్ ఉగాది
* ఉగాది నుండి సృష్టి ఆరంభం
* యుగానికి నాంది ఉగాది
* నూరేళ్ల జీవనయానం కలబోత ఉగాది పచ్చడి
* కుల మతాలకు అతీతమైన పర్వదినం
* తెలుగు రాష్ట్రాలకు తొలి పండుగ
* భారతీయ సంస్కృతికి నూతన వత్సరం
* అందరి జీవితాలలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలి
ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ఓ విశిష్టమైన స్థానం ఉన్నది. ఎందరో ఋషులు, మహానుభావులు, త్యాగదనులు, మానవతీత శక్తులుగా సైన్స్ కి అందని ఎన్నో అద్భుతాల నిలయంగా భారతదేశం విరాజిల్లుతోంది. మనదేశంలో నిర్వహించే ప్రతి పండుగకు ఓ విశిష్టత, వాస్తవికతకు అద్దం పడుతూ అనేక విజ్ఞాన గాథలు దాగి ఉన్నాయి. వాటిలోని కొన్ని అంశాలను మన పాఠకులకు తెలియచెప్పే ఓ చిన్న ప్రయత్నం. భారతీయులు అందునా తెలుగువారు ఎంతో విశిష్టంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే తొలి తెలుగు పండుగగా చెప్పబడే ఉగాది కి సంబంధించి కథను తెలుసుకుందాం.
ఉగాది... యుగాది.. :
‘ఉగాది’ని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటే కొత్త యుగానికి ఇది ఆరంభం. నూతన సంవత్సరం (తెలుగు సంవత్సరం) ప్రారంభం అని అర్థం. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తెలుగు సంవత్సరాదికి ఓ పేరు ఉంటుంది. అలా ఈ 2023వ సంవత్సరం ఉగాది పేరు ‘శోభకృత్ నామసంవత్సరం’.
సృష్టికి ఉగాది నాంది:
ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :
ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది’పేరుతో జరుపుకుంటారు. మరి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏఏ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారో తెలుసా?.. ఎందుకంటే భారతదేశం విభిన్నజాతులు,మతాలు,కులాలు,సంస్కృతి,సంప్రదాయాల మేలు కలయిక.అలాగే ఎన్నో భాషలు భారతదేశంలో వాడుకలో ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,గుజరాతీ,బెంగాలీ ఇలా ఎన్నో భాషల కలయిగా విరాజిల్లుతోంది భారతదేశం. అందుకే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కూడా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి పేర్లు మార్పుతో జరుపుకుంటుంటారు భారతీయులు.
వివిధ ప్రాంతాలలో ఉగాది :
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. అదే మహారాష్ట్రలో గుడి పడ్వా గా, కేరళలో విషు,తమిళనాడులో పుత్తాండు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం ‘ఆది’ అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. తెలుగు వారికీ కొత్త సంవత్సరం..వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.
ఉగాది పచ్చడి – ఆరోగ్య సూత్రాలు :
తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాది విశిష్టత గురించి ఎంతైన చెప్పుకోవచ్చు. ఉగాది నాడు సేవించే వేప పువ్వు పచ్చడి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే… ఆనందమే….ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.
పిండివంటలూ, మధుర పదార్థాలూ తిని రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప.. సాత్త్విక ప్రవృత్తి లభించదు.కనుకనే మన పూర్వీకులు ప్రతి పండుగకూ ఒక అధిష్ఠాన దైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసారు. పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపరానందదాయకమే అవుతుంది.
సంవత్సరాదినాడు తమ తమ ఇష్టదేవతలను పూజించడంతో “ఈసంవత్సరమంతా నాలో దైవానుగ్రహం పుష్కలంగా వుంటుంది అనే భావన నర నరాలలోనూ ఇంకిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏ కార్యమైనా విజయవంతంగా నిర్వహించగలననే ధైర్యం, మనోబలం, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
వేపపూతపచ్చడి:
ఉగాదినాడు వేపపూతపచ్చడి తప్పక స్వీకరించాలి. “నింబకుసుమభక్షణం” అని శాస్త్రాలు పేర్కొన్నాయి. “ఉగాది పచ్చడి” అని కూడా అంటారు. ఇది ఒక ఔషధం..శాస్త్రం ప్రకారమైతే “క్రొత్త చింతపండు తెచ్చి, నీటితో పిసికి, గింజలు, ఉట్లు, తొక్కలు లేకుండా తీసివేసి, చిక్కటి గుజ్జు తయారు చేయాలి. అందులో కాడలు, పుల్లలూ లేకుండా శుభ్ర పరచిన వేపపూలూ అందులో కొద్దిగా బెల్లం వేయాలి. కొద్దిగా నెయ్యివేసి, కలియబెట్టి, దేవునికి నివేదించి, ఉదయాన్నే పరగడుపుననే స్వీకరించాలి.
ఉగాది పచ్చడి స్వీకరణతో... నూరేళ్ల ఆరోగ్యం :
వేపపూతను స్వీకరించడంవల్ల నూరేండ్ల ఆయువూ, వజ్రసమానమైన దేహం, సర్వసంపదలూ, చేకూరి, సంవత్సరమంతా సుఖంగా వుంటారని పెద్దలు చెపుతారు.కొత్తచిత్తపండు బెల్లంలో వుండే దోషాల తీవ్రత ఉగాది నాటికి’ తగ్గి, అప్పటినుంచీ అవి ఆరోగ్యప్రదాలై, రుచి, శుచీ కల్గివుంటాయని పూర్వీకులు వివరిస్తుంటారు. ఈనాడు వేపపూత లో శాస్త్రంతో పనిలేకుండా – ఇంకా కొన్ని చేర్చుకొని, ఇదంతా షడ్రుచులకు సంకేత మని సమన్వయించుకోవడం ఆచారమయింది.
మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు ముక్కలు, అరటి పండ్లు, తేనె కూడా కొందరు కలుపుతారు. కొందరు మిరియాల పొడి లేదా పచ్చి మిరపకాయ ముక్కలు వేస్తారు. మసాలా దినుసులూ వేసేవారున్నారు. ఈ ‘ఉగాదిపచ్చడి’లో మసాలా దినుసులు, ఉప్పు వాడరాదు. వసంతఋతు ప్రారంభంలో ఆకాలంలో దొరికే వేపపువ్వు, బెల్లం, చింతపండు కలిపి, సేవించడం రాగల కాలానికి స్వాగతం చెప్పడమే అవుతుంది.
ఉగాది... పచ్చడి... విశిష్టత :
వేపపూలు : వేపపువ్వు చేదుగా, రుచిగా వుంటుంది. శ్లేష్మాన్నీ, క్రిమిరోగాలనూ, పైత్యాన్నీ, కుష్టువ్యాధినీ, పోగొడుతుంది. నాలుకకు రుచి,జ్ఞానాన్ని కల్గిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. వేపపువ్వును నూనెతోగాని, నెయ్యితోగాని వేయించి, ఉప్పు, కారం కలిపి అన్నంతో స్వీకరిస్తే ఆరోగ్యానికి మంచిది. వేపగాలి, వేపాకులు వేపనూనె ఇలా వేపసంబంధమైనవన్నీ ఆరోగ్య ప్రదాలే.
బెల్లం : బెల్లం జ్వరాన్నీ, కడుపునొప్పినీ, ఉదర రోగాలనూ, వాతాన్ని పోగొట్టుంది. ఒంటిలో నీటిని హరిస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. క్రొత్త బెల్లం ఆరోగ్యకారి కాదు. కనుకనే ఉగాదితో ఆ దోషంపోతుంది. పాతబడుతుంది. పచ్చడిలో సేవించినందున ఆరోగ్యాన్ని కల్గిస్తుంది. గుండెదడనుకూడా తగ్గిస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. నిద్రపట్టిస్తుంది. (మితిమీరి సేవింపరాదు)
చింతపండు: క్రొత్త చింతపండు ఆరోగ్యకరం కాదు. ఉగాది నాటికి చింతపండులో క్రొత్తదనం పోతుంది. ఆనాటినుండి వాడవచ్చు. పాత చింతపండు (కనీసం 2/3 నెలలయినా గడవాలి) ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది. బడలికవల్ల ఏర్పడిన జ్వరాన్ని తగ్గిస్తుంది. హృదయానికి బలాన్ని కల్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. (మంచిదని అధికంగా వాడరాదు)
నెయ్యి: ఆయురారోగ్యాల నిస్తుంది. కంటికి మంచిది. జీర్ణశక్తి నిస్తుంది. బుద్ధి బలాన్ని పెంచుతుంది. శరీరానికి కాంతి నిస్తుంది. విషాన్ని హరిస్తుంది. పిచ్చిని తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఓజస్సును పెంచుతుంది. (శక్తి + కాంతి). (మితిమీరి వాడరాదు)
మామిడి పిందెలు : వడదెబ్బను హరిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్యగుణాలున్న వేపపూత పచ్చడి సేవించడంతో అందలి గుణాలు రక్తంలో కలసిపోయి, సంవత్సరకాలం వాటి ప్రభావాన్ని చూపుతాయి. కనుక ఉగాది నాడు తప్పకుండా వేపపూత పచ్చడి సేవించాలని పెద్దలు సూచించారు. ఉగాది అంటే ఓ పండుగ మాత్రమే కాదని... సర్వరోగ నివారిణిగా ప్రజలందరకు ఉపయోగపడే ఉగాది పచ్చడి... దివ్య ఔషధమై... ప్రకృతి అందించిన అమృతమై విరాజిల్లుతుందని నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
ప్రతి ఒక్కరి అనుభవాల ప్రతీక ఉగాది :
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలిచి... ప్రతి ఒక్కరి భావాలకు ప్రతిరూపంగా మన అరచేతిలో నిలిచే దివ్య ఔషధం ఉగాది పచ్చడి.
సర్వ రసాల మేలు కలయిక
రసానుభూతి గుళిక :
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం.
ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు.
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు.
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు.
మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.
ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఇదే మన సంస్కృతి సాంప్రదాయం. అనధికా వస్తున్న ఆచారం.
రాశుల మోసులు...
వాశిగా శుభాలు... :
తెలుగువారి సంవత్సరాది అంటే ఉగాది మార్చి 22 నుండి మెుదలుకానుంది. హిందూ నూతన సంవత్సర సంవత్ 2080 కూడా ఆరోజే నుండే ప్రారంభం కానుంది. ఉగాది నాడు బుధాదిత్య, గజకేసరి అనే రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా మీనంలో బృహస్పతి, సూర్యుడు, బుధుడు, చంద్రుడు మరియు నెప్ట్యూన్ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ అరుదైన సంయోగం కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
రాశులలో వాశిగా సత్ఫలితాలు :
మేష రాశి:
ప్రత్యేక రంగాలతో పాటు మీరు జీవితంలోని దాదాపు అన్ని రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఇది మిమల్ని విజయవంతమైన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. కొన్నింటిలో లోతైన ఆలోచనలో ఉంటారు మరియు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కాస్త కష్టమవుతుంది. మీ రాశిలో రాహువు ఉండటం వల్ల మిమల్ని కొద్దిగ్గా నిరంకుశంగా మారుస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని విస్మరించడంలో మీరు విఫలమవుతారు.
వృషభ రాశి
సగటు విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం మీ కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది సవాళ్లతో నిండిన సంవత్సరమని చెప్పుకోవచ్చును కానీ మీ అకుంటిత ప్రయత్నాలకు గొప్ప విజయాలు లభిస్తాయి. ఏప్రిల్ 22 వరకు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మీకు చెప్పుకోదగిన ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
మిధున రాశి
మీకు శారీరకంగా మరియు ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు కనబడుతావి. కుజుడు మీ పన్నెండవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు అయితే ఇది మీ కష్టాలు పరిష్కరించబడే సంవత్సరం. శని ఎనిమిదవ ఇంటిని వదిలి జనవరి 17 న మీ తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశం చేస్తాడు కాబట్టి అప్పటి నుండి మీ అదృష్టానికి రెడ్ కార్పెట్ పరుస్తుంది.
కర్కాటక రాశి
మీరు కార్య విజయం సాధిస్తారు. కుటుంబ / దాంపత్య సంబంధాలలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఈ ప్రయత్నంలో సహనంతో విజయవంతం కావాలి. రియల్ ఎస్టేట్ కొనుగోలు మరియు అమ్మకం మీకు మంచి ఆర్థిక పరంగా అబివృద్దిని ఇస్తుంది. మీకు ప్రియమైన వారిని మీదైన శైలిలో ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రేమించడం ద్వారా వారి హృదయాన్ని గెలుచుకుంటారు.
సింహరాశి :
ఆగష్టు నుండి మీ గ్రహ సంచారము క్రమంగా అనుకూలత వైపు కదులుతుంది మరియు మీకు విజయాన్ని తెస్తుంది.
అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యా రాశి:
మీరు బలమైన విశ్వాస వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో మీరు వారితో సత్సంబంధాలను కొనసాగించడంలో విజయం సాధిస్తారు. వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు విద్యార్థిగా కూడా విజయం సాధిస్తారు.
అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి
ప్రారంభంలో ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. మీరు పనిలో చాలా కృషి చేస్తారు.మీ దాంపత్య మరియు వృత్తిపరమైన అంశాలు రెండూ అభివృద్ధి చెందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చిక రాశి
కొత్త సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుందని సూచిస్తుంది వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి మరియు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు అనుకూలిస్తాయి. గోచారరిత్య అర్ధాష్ట శని ప్రభావం ప్రారంభం కాబోతున్నది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సు రాశి
మీరు విదేశాలకు మరియు దూరప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మీ స్వంత ప్రయత్నాలు అద్భుతమైన విజయానికి దారి తీస్తాయి.ఆర్థికంగా మీరు ఈ సమయంలో పురోగతి సాధిస్తారు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకర రాశి
మీరు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం నుండి లాభం పొందుతారు మరియు మీరు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇంటిని నిర్మించడంలో కూడా విజయం సాధిస్తారు. మీ మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని అనేక పనులను చేయడానికి అనుకూలంగా సహకరిస్తుంది.
అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి
మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మీకు విదేశీ వాణిజ్యంతో సంబంధాలు మరియు మంచి విదేశీ పరిచయాలు కూడా ఉంటాయి. మీరు క్రమశిక్షణను కొనసాగించడం ద్వారా పని రంగంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేయబడతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఏలినాటి శని రెండవ అంకం నడుస్తున్నందున మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీన రాశి
ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. మీరు అనేక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. అది మీ కెరీర్ అయినా మీ వ్యక్తిగత జీవితం అయినా, మీ పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా అయినా లేదా విధి యొక్క హస్తం అయినా మీరు ఈ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు.ఉపశమనం, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.



.jpeg)
.jpeg)
