ఏడాదిలో 486 న్యూరో సర్జరీలు!
విశాఖ:
-త్వరలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం
-35స్పెషల్ వైద్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
-ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో రకాల ఉచిత వైద్య సేవలు
-విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు
విశాఖపట్నం: విశాఖ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఏడాది వ్యవధిలో 486 న్యూరో సర్జరీలు చేశామని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు వెల్లడిరచారు. అదే విధంగా బ్రెయిన్ స్రోక్‌కు సంబంధిత చికిత్సలెన్నో జరిపించామని, ఆర్థో సేవలు, 70మందికి పీఆర్‌డీ థెరపీ, హెడ్, నీ ట్రాన్సప్లాంటేషన్, స్పైనల్ లాప్రోస్కోపీ వంటి సేవలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం విమ్స్‌కు కనీసం 600నుంచి 700ఓపీలుంటాయని, రమారమి 200లకు తక్కువ లేకుండా ఇన్‌పేషెంట్లు ఉంటున్నారని గుర్తు చేశారు. తమ వద్ద ఐసీయూ, వెంటిలేటర్, ప్రత్యేక వైద్యుల సహాయం అందుబాట్లోనే ఉంటాయని, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి రోగులొస్తున్నారన్నారు.
త్వరలో ‘స్పైనల్ రిహాబిలిటేషన్ సెంటర్’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో త్వరలో విమ్స్‌లో ‘స్పైనల్ రిహాబిలిటేషన్ సెంటర్’ ఏర్పాటు కానుందని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, ఆ సెంటర్ కనుక విశాఖలో ఏర్పాటైతే ఏపీలోనే అది తొలి సెంటర్ అవుతుందని డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు. వైద్య పరికరాలొస్తే వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకోసం ఓ హాలుతో పాటు 20బెడ్‌లు, గ్రౌండ్, క్రీడా పరికరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామన్నారు. విమ్స్‌లో పనిచేసేందుకు వైద్య సిబ్బంది ఆశక్తి చూపిస్తుంటారని, ఇక్కడన్ని రకాల వసతులుండడంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా కారణమన్నారు. సిబ్బంది లంచం తీసుకుంటే ఫిర్యాదివ్వవచ్చని, సమయ పాలన ఇక్కడ కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. అదే విధంగా ఇక్కడ త్వరలో సిటీ డయాగ్నస్టిక్ సెంటర్ కూడా రానుందని, నగరంలో మరే ఆస్పత్రిలోనూ లేనంతగా ఉచితంగా సేవలు అందుబాట్లోనే ఉంటాయన్నారు. కేథల్యాబ్ సేవలు కూడా రానున్నాయన్నారు. రోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలో 35స్పెషల్ వైద్యుల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.
ఆరోగ్య శ్రీ పథకానికి స్పెషల్ టీం
విమ్స్‌లో మరెక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ పథక పరిశీలనకు 15నుంచి 20మందితో కూడిన ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. ఆరోగ్య శ్రీలో పూర్తి ఉచితంగానే వైద్య సేవలుంటాయన్నారు. పల్మనాలజీ, చెస్ట్ ఫిజీషయన్, ఈఎన్‌టీలో కాక్లియర్ ఇంప్లాంటేషన్, జనరల్ మెడిసిన్, వైరల్ జ్వరాలైన మలేరియా, టైఫాయిడ్ తదితర వాటికి ఆత్మసాక్షిగా సిబ్బంది వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. విమ్స్‌లో 33మంది వైద్యులు, 212మంది నర్సులు, 200మంది వైద్య సిబ్బంది, 70మంది కార్యాలయ సిబ్బంది, 40మంది టెక్నీషియన్లు, నలుగురు ఫిజియో థెరపిస్టులు, 70మంది పారిశుద్ధ్య సిబ్బంది, 50మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. విమ్స్‌లో ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందరూ సహకరించాలని ఆ సంస్థ డైరెక్టర్ కె.రాంబాబు స్పష్టం చేశారు.


.jpeg)
