ప్రశాంత విశాఖలో అలజడులు సృష్టించి, రాజధాని పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారు
-జనసేన నేత పీవీఎస్ఎన్ రాజు
విశాఖపట్నం,వి న్యూస్ , నవంబర్ 1:
ప్రశాంత విశాఖలో వైసీపీ నేతలు అలజడులు సృష్టించి, రాజధాని పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని జనసేన చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15న పవన్ కళ్యాణ్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు, కావాలని వీధిలైట్లు ఆపివేసి, పోలీసులు జనసేన నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని అందరూ గమనించారన్నారు.
పవన్ కళ్యాణ్ విమానాశ్రయానికి నాలుగు గంటలకు చేరితే, అదే సమయంలో ఎఫ్ఐఆర్ బుక్ చేసి జనసేన నేతలను 90 మందిని అదుపులోకి తీసుకొని పలు పోలీస్ స్టేషన్లో మరుసటి రోజు వరకు తిప్పారన్నారు. తర్వాత 307 సెక్షన్ కింద హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి జడ్జి దగ్గర హాజరు పరచగా, జడ్జికి జరిగిన విషయాలు వివరించడంతో 306 సెక్షన్ కింద మార్చి రిమాండ్ తరలించారన్నారు.
పవన్ కళ్యాణ్ జనవాణి చేపడితే వైసీపీ పునాదులు కదులుతాయని భయపడుతున్నారన్నారు. విశాఖ గర్జన ఫ్లాప్ అయిందని, సచివాలయం ఉద్యోగులు, ఏయూ విద్యార్థులను తీసుకువచ్చి విశాఖ గర్జన చేపట్టారన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విద్యార్థి గర్జన చేపట్టారని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి విద్యార్థినీ విద్యార్థులను రోడ్డుపైకి తీసుకువచ్చారన్నారు. అయితే విద్యార్థులు "పవన్ రావాలి -జగన్ పోవాలి" అంటూ నినాదాలు చేశారన్నారు. చోడవరం చాలా వెనుకబడి ఉందని, ధర్మశ్రీ ఒక్క డిగ్రీ కాలేజ్ అక్కడికి వచ్చేలా చేయలేకపోయారన్నారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండే వారిని, ఎంత అణిచివేస్తే అంతగా జనసేన వైపు ప్రజలు ఉంటారన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయడం తప్పు చేశామని ఇటీవల ప్రశాంతి కిషోర్ అన్న మాటలను గుర్తు చేశారు. 2024లో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు దింపేస్తారని ఆయన జోస్యం చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో అధికారం కేంద్రీకృతం అయిందని, ప్రజలు చైతన్యమై వైసీపీ నేతలు రోజా, రజిని, ధర్మశ్రీ, జోగు రమేష్ లాంటి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రజల గుండెచప్పుడును చోడవరం లోని విద్యార్థి గర్జనలో "పవన్ రావాలి- జగన్ పోవాలి"అని విద్యార్థి విద్యార్థినిలు బయటపెట్టారన్నారు. ఆబాల గోపాలం వంటి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించి కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. యువతకు ఉపాధి కల్పించడం, పరిశ్రమలను రప్పించడం చేయాలని, రాజధాని పేరుతో కబ్జాలు చేయడం కాదని వైసీపీకి చురకవేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ఓటు హక్కు ద్వారా దశ దిశ యువత మార్చనుందని తెలిపారు. దళితులు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలపై చట్టపరంగా శాంతియుతంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ కూడా పాల్గొన్నారు.

