నవంబరు 1వ తేదీ నుంచి పెరుగుతున్న విజయ పాల ధరలు.
విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్కు 2 రూపాయల చొప్పున పెరగబోతున్నాయి. ఈమేరకు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటన జారీచేసింది. కొండెక్కిన నిత్యావసర ధరలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఇది ఒకరకంగా షాకింగ్ లాంటి వార్త. ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అరలీటరు ప్యాకెట్ రూ.34గా ఉంది. గోల్డ్ ప్యాకెట్ రూ.35గా ఉంది. నవంబరు 1 నుంచి ఇవి రూ.35, రూ.36కు విక్రయించబోతున్నారు. నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్ ధరలు కూడా పెరిగాయాని, దీంతో పెంచక తప్పలేదని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది.లోఫ్యాట్(డీటీఎం), ఎకానమీ (టీఎం), ప్రీమియం (ఎస్టీడీ) పాల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ముడిసరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, కొన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న ముడి సరుకుల ధరలు పెరిగాయని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సంస్థ ఎండీ కోరారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాల ధరను పెంచడంతో ప్రయివేటు రంగంలో ఉన్న డెయిరీలన్నీ తమ పాల ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే కూరగాయల నుంచి గ్యాస్ వరకు అన్ని నిత్యావసరలు భారీగా పెరగడం.. ఆదాయం పెరగకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.రోజురోజుకు ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అన్నట్లుగా తమపరిస్థితి తయారైందని, పెరిగిన ధరలతో ఇప్పటికే నూనె వాడకం తగ్గించుకున్నామని, గతంలో 2వేల రూపాయలకు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు వచ్చేవని, ఇప్పుడు మాత్రం రూ.10వేలు పెట్టినా ఏమీ రావడంలేదని వాపోతున్నారు.

