ఆంధ్రప్రదేశ్ దేశానికి జగన్ ప్రధానమంత్రి కావచ్చు కదా?

 * ఆంధ్రప్రదేశ్ దేశానికి జగన్ ప్రధానమంత్రి కావచ్చు కదా ?..!* 


పసుపు రంగు శుభప్రదం

నవంబర్ 1న అందరూ పసుపు రంగు దుస్తులు ధరించాలి* 

రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా నిర్వహిస్తారు?* 

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటే దేశానికి ఎన్ని రాజధానులు ఉండాలన్నారు

---- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

భీమిలి తగరపువలస: వి న్యూస్ ప్రతినిధి

తాను కేవలం పసుపు రంగుచొక్కా వేసుకున్నందుకే పోలీసులు అరెస్టు చేశారని  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. తగరపువలసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ.. గీతం విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల సీతారామన్ ను కలిసేందుకు పసుపు చొక్కా ధరించి వెళుతున్న తనను..  ఋషికొండ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేయడం పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ నవంబర్ ఒకటో తేదీన  ప్రజలందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పసుపు ధరించి ఎక్కడికక్కడ  సమూహాలుగా ఏర్పడాలని సూచించారు. పురుషులు పసుపు రంగు షర్ట్, మహిళలు పసుపు చీరలు లేదా చుడీదార్ (పంజాబీ డ్రెస్) ధరించాలని విజ్ఞప్తి చేశారు. పసుపు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ రంగు కాదని, పసుపు శుభప్రదమైన రంగు అన్నారు. నవంబర్ 1న నుంచి రాష్ట్రమంతటా శుభం జరగబోతుందని జోశ్యం చెప్పారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా నిర్వహిస్తారు?* ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటో స్పష్టంగా తెలియని పరిస్థితుల్లో  నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా నిర్వహిస్తారని  ప్రభుత్వాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్  ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటే దేశానికి ఎన్ని రాజధానులు ఉండాలన్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క దేశంగా విభజిస్తే అనేక పదవులు పుట్టుకొస్తాయన్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి జగన్ ప్రధానమంత్రి కావచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరూ 3 రాజధానులు కోరుకోవడం  లేదని ఏకైక రాజధాని అమరావతిని ఆకాంక్షిస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో కూడా పట్టభద్రుల  ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని.. లక్షలాది మంది పట్టబద్రులు తరలివచ్చి ఓటర్లుగా నమోదు   చేసుకోవాలని కోరారు.