భూములు కోల్పోయిన నిరుపేద రైతులకు వెంటనే ఇల్లు ఇవ్వాలి అని కలెక్టరేట్ వద్ద ధర్నా.

 భూములు కోల్పోయిన నిరుపేద రైతులకు వెంటనే ఇల్లు ఇవ్వాలి అని కలెక్టరేట్ వద్ద ధర్నా.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

విశాఖ జీవీఎంసీ జోన్‌ 2 బక్కన్నపాలెం గ్రామంలో భూములు కోల్పోయిన రైతులమైన మాకు మా భూములలో నిర్మించిన ఇండ్ల్లు కేటాయించాలని కోరుతూ విజ్ఞప్తి. విశాఖ రూరల్‌ మండలం జివియంసి జోన్‌`2 పరిధిలో 6వ వార్డులో బక్కన్నపాలెం గ్రామంలో 94 నుండి 102 వరకు గల రెవెన్యూ సర్వే నెంబర్లులో 86 మంది పేద, దళిత వర్గాల చెందిన రైతులకు 44సం॥ క్రితం అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరం చొప్పున భూములు ఇచ్చింది. అప్పట్లో రైతులైన మేము ఆ భూములలో సాగుచేయడంతో పాటు, ఆవులు, గేదెలు పెంచుకుంటూ జీవనోపాధి పొందేవారము. మరి కొంత మంది కోళ్ళఫారం లాంటివి కూడా పెట్టీ సరిగ్గా నడవక నష్టపోయారు. మేమంతా ఆ భూములు ఉపయోగించి జీవనోపాధి పొందుటకు అనేక అప్పులు చేసాము. తరువాత మా భూములను ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా తీసుకున్నది. మా భూములలో జవహర్‌ నవోదయ విద్యాలయం, పోలీస్‌ శిక్షాణ కేంద్రం, దివ్యాంగుల ఐటిఐ, పట్టుపురుగుల శాఖ కార్యాలయం నిర్మించారు. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పట్లో మేము అధికారులను సంప్రదించగా నష్టపరిహారం చెల్లించాటనికి మరియు ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి వాగ్దానం చేసారు. ఇప్పటివరకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా మాకు న్యాయం చెయ్యలేదు. అప్పటి నుండి కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నాము. మా భూములలో 2016, 2017 సంవత్సరంలో జూనియర్‌ కాలేజీని మరియు ఎన్‌టిఆర్‌ హూద్‌హూద్‌ ఇండ్లు నిర్మించారు. ఈ భూముల్లో మాకు ఇంటి నిర్మాణాలు స్థలాలు కేటాయించాలని కోరాము. అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ అధికార్లు ఇక్కడ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ వారి ఆర్ధిక సహాయంతో పేదలకు హూదూద్‌ తుఫాన్‌లో నష్టపోయిన వారి కోసం ఇండ్లు జి3గా నిర్మిస్తున్నామని ఈ ఇళ్ళు మీకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎపి స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ భూములు కోల్పోయిన మా పేర్లులను కూడా నమోదు చేసారు.  తరువాత ఆ ఇండ్లను పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు బినామి పేర్లతో తమ అనుచరులకు, కార్యకర్తలకు కేటాయించుకుంటున్నారు. తీవ్రంగా నష్టపోయిన నిర్వాసితులమైన మాకు ఇప్పటికి ఆ ఇండ్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం భూములు కోల్పోయిన మాకు ఒక్క కుటుంబం 3 కుటుంబాలకు పెరిగి ఇళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. బ్రతుకు తెరువు కష్టమైపోయింది. మాకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కావున భూమి కోల్పోయిన మాకు కుటుంబానికి (ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ముగ్గురు పెళ్లి అయిన వారు ఉంటున్న) రెండు ఇళ్ళ చొప్పున జవహర్‌ నవోదయ విద్యాలయం వద్ద నిర్మించిన ఇండ్లును మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, మధురవాడ జోన్‌ అధ్యక్షులు డి. అప్పలరాజు, కెవిపిఎస్‌ నగర కార్యదర్శి ఆర్‌పి. రాజు, ఎస్‌. పైడితల్లి, సియ్యాద్రి కనకారాజు, పైడిరాజులతో పాటు బాధిత రైతులు పాల్గోన్నారు.