మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్(12862) రైలును శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు.


వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో ఆపాలని స్థానికులు కోరారని.. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాగా, మహబూబ్‌నగర్-విశాఖ 12861, 12862 రైళ్ల రాకపోకల వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు సులభంగా ప్రయాణాలు చేయవచ్చు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లా ప్రజలు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగుతాయి. ఈ అవకాశాలతో పాటు ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞాన విహారయాత్రలు చేసుకోవడానికి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.